ఉద్యోగ ప్రకటనను రక్తి కట్టిస్తున్న కేసీఆర్‌

March 09, 2022


img

తెలంగాణ ప్రభుత్వం గత 3-4 ఏళ్ళ నుంచి 50 వేల ఖాళీలను భర్తీ చేస్తామంటూ ఊరిస్తోంది తప్ప ఇంతవరకు నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటు, దాని ప్రకారం ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కారణంగా ఆలస్యమైందని సంజాయిషీ చెప్పింది. అది కూడా పూర్తయ్యి రెండు నెలలైనప్పటికీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలలో ఉన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్షాలు నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఒత్తిడి చేస్తూనే ఉన్నాయి. 

నానాటికీ ఆ ఒత్తిళ్ళు పెరిగిపోతుండటంతో సిఎం కేసీఆర్‌ నిన్న వనపర్తి బహిరంగ సభలో ఉద్యోగాలపై ఓ ప్రకటన చేశారు. “బుదవారం ఉదయం 10 గంటలకు శాసనసభలో నేను ఉద్యోగాల భర్తీకి సంబందించి ఓ ప్రకటన చేయబోతున్నాను. కనుక నిరుద్యోగులందరూ ఆ సమయానికి టీవీలు చూడండి,” అని చెప్పారు.   

ప్రభుత్వోద్యోగాల భర్తీ ఓ నిరంతర ప్రక్రియ. ఉద్యోగులు పదోన్నతులు, పదవీ విరమణలతో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయవలసిన ఈ పనిని దాదాపు మూడేళ్ళపైగా వాయిదా వేసుకొంటూ వచ్చి ఇప్పుడు ఉద్యోగాల భర్తీ ప్రకటనను కూడా ఏదో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నట్లు ఇంత రక్తి కట్టిస్తుండటం విశేషం.

ఏదైనా అడిగిన వెంటనే ఇస్తే దానికి పెద్దగా విలువ ఉండదు. అదే ఎదురుచూపులు, నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ఇస్తే అది అద్భుతంగా ఉంటుంది. దానిని ఇచ్చిన వారికి గౌరవం అమాంతం పెరిగిపోతుంది కూడా. అందుకు నిదర్శనంగా 55 రోజుల ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలను చెప్పుకోవచ్చు. సమ్మె చేసిన ఉద్యోగులకు వరాలు ప్రకటించి వారితోనే పాలాభిషేకాలు చేయించుకొన్న ఘనత సిఎం కేసీఆర్‌ది.

ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా సిఎం కేసీఆర్‌ బహుశః ఇదే ఫార్ములా అమలుచేస్తునట్లు కనిపిస్తోంది. ఇంతకాలం తనపై, తన ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులే ఇప్పుడు తన ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేయగల నేర్పు ఒక్క సిఎం కేసీఆర్‌కే చెల్లు. మరి ఈరోజు శాసనసభలో ఉద్యోగాల భర్తీపై ఏమి ప్రకటన చేస్తారో... అప్పుడు నిరుద్యోగులు ఏమి చేస్తారో చూడాలి.


Related Post