గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలు కేసీఆర్‌ని ఉద్దేశించినవేనా?

March 08, 2022


img

ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వివిద రంగాలకు చెందిన మహిళలను సన్మానించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “పురుషులతో సమాన హక్కుల కోసం మనమంతా పోరాడుతుంటే, మరోవైపు అత్యున్నత పదవులలో ఉన్న మహిళలకు కూడా వివక్షకు గురవుతున్నారు. మహిళలకు సరైన గౌరవం లభించకపోగా అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుండటం చాలా బాధాకరం. అయియప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మహిళలు నిత్యం ఇటువంటి అనేక సమస్యలతో పోరాడుతూనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నారు. మహిళా సాధికారతకు నిదర్శనంగా నేడు మహిళా దినోత్సవం జరుపుకొంటున్నాము,” అని అన్నారు. 

‘అత్యున్నత పదవులలో ఉన్న మహిళలు కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు...ఉన్నత పదవులలో ఉన్న మహిళలకు తగిన గౌరవం లభించడం లేదు...నన్ను ఎవరూ భయపెట్టలేరు… నేను ఎవరికీ భయపడను...’ అంటూ గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా సిఎం కేసీఆర్‌ను ఉద్దేశ్యించినట్లుగానే ఉన్నాయి. 

తమిళిసై సౌందరరాజన్‌ ఇటీవల మేడారం జాతరకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వం తరపున ఎవరూ స్వాగతం చెప్పకపోవడంతో ఆ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆమెకు స్వాగతం పలికి గద్దెల వద్దకు తోడ్కొని తీసుకువెళ్ళారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన, మహిళా గవర్నర్‌ను అవమానించడమే అని కాంగ్రెస్‌, బిజెపిలు టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా టిఆర్ఎస్‌ వాటిని ఖండించింది. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే నిన్నటి నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించడంపై కూడా తమిళిసై సౌందరరాజన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దానిపై కూడా ప్రతిపక్షాలు విమర్శలను టిఆర్ఎస్‌ ఖండించి తమ ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకొంది. కనుక నేడు తమిళిసై సౌందరరాజన్‌ చేసిన వ్యాఖ్యలు సిఎం కేసీఆర్‌ తీరును తప్పుపడుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది.


Related Post