నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజా సింగ్ పదేపదే అడ్డుతగులుతుండటంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వారిని ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి హరీష్‌రావు శాసనసభలో మధ్యాహ్నం 1.30 గంటలకు తన బడ్జెట్ ప్రసంగం ముగించిన తరువాత శాసనసభను బుదవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలవడంతో శాసనసభలో బిజెపి బలం మూడుకి పెరిగింది. ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. పైగా టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కేంద్రప్రభుత్వం, బిజెపిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కనుక ఈసారి శాసనసభలో ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు వివిద అంశాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారానుకొంటే, మొదటి రోజే సస్పెన్షన్ వేటు వేయించుకొని బయటపడ్డారు. ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని తప్పు పట్టలేము. ఆర్ధికశాఖ మంత్రి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు, అధికార, ప్రతిపక్ష సభ్యులు దానిని సావధానంగా విని ఆకళింపు చేసుకోవాలి. అందుకే రేపు శాసనసభ, మండలికి సెలవు ఇస్తుంటారు. కానీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడే అభ్యంతరాలు చెపుతూ మాట్లాడటాన్ని ఎవరూ హర్షించలేరు.