హుజూరాబాద్ ఉపఎన్నికలకు ముందు నుంచి టిఆర్ఎస్-బిజెపిల రాజకీయ యుద్ధం మొదలైంది. సాధారణంగా ఎన్నికల ఫలితాల వెలువడిన అటువంటి యుద్ధాలు నిలిచిపోతుంటాయి. కానీ వాటి మద్య నానాటికీ యుద్ధం తీవ్రతరం అవుతూనే ఉంది. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర బిజెపి నేతలు జితేందర్ రెడ్డి, డికె.అరుణ హస్తం ఉందని అనుమానిస్తున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పడంతో టిఆర్ఎస్-బిజెపిల మద్య మళ్ళీ మరో కొత్త యుద్ధం మొదలైంది.
స్టీఫెన్ రవీంద్ర ఈ ఆరోపణ చేయగానే బిజెపి నేతలు ఆయనపై, టిఆర్ఎస్ ప్రభుత్వం, సిఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. హుజూరాబాద్ ఓటమితో సిఎం కేసీఆర్‌కు భయం పుట్టుకొందని అప్పటి నుంచే రాష్ట్రంలో బిజెపిని బద్నామ్ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కాపాడేందుకే టిఆర్ఎస్ ఈ కొత్త డ్రామా మొదలుపెట్టిందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా సిఎం కేసీఆర్ డైరెక్షన్‌లో జరుగుతోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి ఎదుగుదల చూసి సిఎం కేసీఆర్‌కు భయం పుట్టుకొందని అందుకే బిజెపి నేతలను టార్గెట్‌గా చేసుకొని అక్రమ కేసులు బనాయింపజేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అయితే తాము కూడా సిఎం కేసీఆర్‌తో సహా టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవినీతి చిట్టాలు తయారు చేసి కేంద్రానికి అందిస్తున్నామని తగిన సమయంలో కేంద్రప్రభుత్వం తగిన చర్యలు తీసుకొంటుందని బండి సంజయ్ అన్నారు.
టిఆర్ఎస్ మంత్రుల వాదన మరోలా ఉంది. "రాష్ట్ర బిజెపి నేతలు తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం సహకరించకపోగా, రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేయించడానికి కూడా సిద్దమయ్యారు. టిఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక రాష్ట్ర బిజెపి నేతలు చివరికి హత్యా రాజకీయాలకు దిగజారిపోయారు. మంత్రి హత్యకు కుట్ర పన్నినవారికి బిజెపి నేతలు ఆశ్రయం కల్పించడమే వారూ ఈ కుట్రలో ఉన్నారని స్పష్టం అవుతోంది. కనుక ఈ కుట్రలో నిందితులుగా పేర్కొన బిజెపి నేతలు జితేందర్ రెడ్డి, డికె.అరుణలను తక్షణం అరెస్ట్ చేయాలని డిజిపి మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాము," అని అన్నారు.