రష్యా అణుబాంబులు ప్రయోగించగలదా?

March 03, 2022


img

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా, అపారమైన తన సైనిక శక్తి సామర్ధ్యాలు చూసి ఉక్రెయిన్‌ పెద్దగా ప్రతిఘటించకుండానే తనకు లొంగిపోతుందని భావించింది. కానీ 8 రోజులుగా ఉక్రెయిన్‌పై రాత్రిపగలు బాంబుల వర్షం కురిపిస్తున్నా ఇంతవరకు లొంగలేదు పైగా ప్రతీరోజు ఉక్రెయిన్‌ సైనికులు, ప్రజల చేతుల్లో రష్యన్ సైనికులు చనిపోతూనే ఉన్నారు. అమెరికా, యూరోపియన్ దేశాలు ఓ పక్క రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తూనే మరోపక్క ఉక్రెయిన్‌కు ఆయుధసామాగ్రి, భారీగా నిధులు అందజేస్తున్నాయి. వాటితో ఉక్రెయిన్‌ పోరాటం కొనసాగిస్తోంది. 

ప్రపంచ దేశాల ఆంక్షలను...వాటి తీవ్ర పరిణామాలను రష్యా ముందే ఊహించి ఉండవచ్చు కానీ 8 రోజులు గడిచినా ఉక్రెయిన్‌పై పూర్తి పట్టుసాధించలేకపోవడంతో రష్యా తీవ్ర ఒత్తిడికి గురవుతోయింది. దీంతో అమెరికా, యూరోపియన్ దేశాలపై మండిపడుతోంది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌తో చేతులు కలిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తోంది. 

రష్యా అధ్యక్షుడు పుతీన్ అణుబాంబులు ప్రయోగించడానికి సిద్దంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వగా, రష్యా విదేశాంగమంత్రి సెర్జీ లావ్రోవ్‌ ‘మూడో ప్రపంచయుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందంటూ’ హెచ్చరించారు. 

ఇటువంటి పెను ప్రమాదాలు పొంచి ఉన్నందునే అమెరికా, యూరోపియన్ దేశాలు ఇంతవరకు ప్రత్యక్షంగా యుద్ధంలో దిగలేదు. అయితే తీవ్ర అసహనంతో ఉన్న రష్యా అణుబాంబు ప్రయోగిస్తే, వెంటనే అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా రష్యాపై అణుబాంబులు ప్రయోగించడం ఖాయం. అదే మూడో ప్రపంచయుద్ధం అవుతుంది. 

‘ఒకవేళ రష్యాపై ఏ దేశమైన అణుబాంబులు ప్రయోగించినట్లయితే రష్యా లేని భూమండలాన్ని ఊహించుకోలేమని’ అధ్యక్షుడు పుతీన్ అన్నారు. అంటే ఒకవేళ రష్యా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితే వస్తే ఈ భూమండలంపై ఏ ఒక్క దేశమూ కనబడకుండా తుడిచిపెట్టేస్తామని పుతీన్ హెచ్చరిస్తున్నట్లు భావించవచ్చు. 

అయితే నిజంగానే రష్యా శతృదేశాలపై అణుబాంబు ప్రయోగిస్తుందా? అంత సాహసం చేయగలదా?అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అమెరికాపై రష్యా అణుబాంబు ప్రయోగించినట్లయితే అది అమెరికా చేరేందుకు సుమారు 15-25 నిమిషాలు సమయం పడుతుందని యుద్ధ నిపుణులు చెపుతున్నారు. ఆ మాత్రం సమయం ఉంటుంది కనుక అప్పుడు అమెరికా కూడా రష్యాపై అణుబాంబుల వర్షం కురిపించి పూర్తిగా తుడిచిపెట్టేయగలదు. 

ఈవిషయం రష్యాకు కూడా బాగా తెలుసు. బహుశః అందుకే శతృదేశాలను భయపెట్టేందుకు మాత్రమే రష్యా తన అణుబాంబుల ప్రస్తావన చేస్తోందని యుద్ధ నిపుణులు చెపుతున్నారు. 

అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్నంత కాలం ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పటికే ఉక్రెయిన్‌పై పట్టు సాధించలేక, మరోపక్క ప్రపంచదేశాల విమర్శలు, ఆంక్షల ఒత్తిళ్ళు భరించలేక, సొంత ప్రజలే వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండటంతో రష్యా చాలా అసహనంగా ఉంది. కనుక రష్యా సహనం కోల్పోయినా లేదా అమెరికా, యూరోపియన్ దేశాలలో ఏది సంయమనం కోల్పోయినా అది అణు యుద్ధానికి.. ప్రపంచ వినాశనానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది.


Related Post