ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో ఉక్రెయిన్‌లో చిక్కుకొన్న భారతీయుల తరలింపును వేగవంతం చేయాలని నిర్ణయించారు. దీని కోసం కేంద్రమంత్రులు జ్యోతిరాధిత్య సింధియా, హర్దీప్ సింగ్‌ను పురి, కిరణ్ రిజ్జు, రిటర్డ్ జనరల్ వికె సింగ్ నలుగురూ ఉక్రెయిన్ సరిహద్దులోని రొమేనియా, హంగేరీ, పోలాండ్, స్లోవేకియా దేశాలకు చేరుకొని అక్కడ భారతీయుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా ద్వారా ఉక్రెయిన్ నుంచి ఇప్పటికే అనేక మంది భారతీయులు స్వదేశానికి చేరుకొన్నారు. భారత్‌లోని విదేశాంగశాఖ ఉన్నతాధికారులు ఉక్రెయిన్‌తో సహా సరిహద్దు దేశాలలోని భారత్ ఎంబసీ అధికారులతో నిరంతరం మాట్లాడుతూ తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ్ళ రష్యా-ఉక్రెయిన్‌ల మద్య శాంతి చర్చలు మొదలవనున్నాయి కనుక క్రమంగా ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. కనుక ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ మరింత వేగవంతం కావచ్చు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సిద్దమవుతోందని కేంద్రప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అప్పుడు ఉక్రెయిన్‌లో భారతీయులను తరలించడానికి ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్న సమయంలో కేంద్రమంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపాలనుకోవడం విస్మయం కలిగిస్తుంది.
ఎన్నికలొచ్చినప్పుడు ఇటువంటి అంశాలతో ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టడం బిజెపికి అలవాటే అని సిఎం కేసీఆర్‌తో సహా పలువురు విపక్ష నేతలు విమర్శిస్తుండటం అందరికీ తెలిసిందే. కనుక నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు కీలక దశకు చేరుకొన్న ఈ తరుణంలో ఉక్రెయిన్‌లోని ఈ పరిణామాలను బిజెపికి అనుకూలంగా మలిచేందుకే కేంద్రమంత్రులను అక్కడకు బయలుదేరుతున్నారని, తద్వారా ఎన్నికల రాష్ట్రాలలో ప్రజలను ఆకట్టుకొని రాజకీయ లబ్ది పొందాలని బిజెపి ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శించకమానవు.