అందరూ వచ్చేస్తున్నారు కానీ ఆమె మాత్రం...

February 28, 2022


img

గత 5 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఆ దేశంలో చిక్కుకొన్న భారతీయులు, ముఖ్యంగా విద్యార్దులందరూ తమను కాపాడాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను వేడుకొంటున్నారు. కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాలలో రోజూ వందల మంది తిరిగివచ్చేస్తున్నారు. అయితే ఒకే ఒక్క భారతీయ యువతి (విద్యార్ధిని) మాత్రం ఇంతకాలం తనకు ఆశ్రయం కల్పించి ఆదరించిన ఉక్రెయిన్‌ కుటుంబానికి అండగా అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకొంది. ఆమె  తల్లి స్నేహితురాలు సవితా ఝకార్ ఈవిషయం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 

 

హర్యానాకు చెందిన నేహా ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్ళింది. మొదట కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకొన్న నేహా తరువాత అక్కడ ఓ ఉక్రెయిన్ కుటుంబంతో కలిసి వారి ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటోంది. దాంతో ఆమెకు వారి కుటుంబంతో మంచి అనుబందం ఏర్పడింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పిలుపు మేరకు ఆ కుటుంబ పెద్ద తుపాకీ చేతబట్టి రష్యాతో పోరాడేందుకు యుద్ధానికి వెళ్ళారు. దీంతో ఆయన భార్య, ముగ్గురు పిల్లలకు తోడుగా నేహా కూడా ఉండిపోయింది. 

ఇంతకాలం తనను ఎంతగానో ఆదరించి అన్నంపెట్టి తన బాగోగులు చూసుకొన్న ఆ కుటుంబాన్ని ఈ కష్టకాలంలో విడిచిపెట్టి రాలేనని నేహా తన తల్లికి తెలియజేసింది. వారికి తోడుగా నేహా కూడా ప్రస్తుతం బంకర్‌లోనే ఉంటోంది. ఆమె నిర్ణయం చాలా దుస్సహసమే...ఆమె ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు...కనుక ఇది చాలా మూర్కత్వమే అని చాలా మంది అనుకోవచ్చు కానీ తనను ఆదరించిన వారి చేతిని కష్టకాలంలో విడిచిపెట్టకూడదనే ఆమె గొప్ప ఆలోచనను ఎంతమంది అభినందిస్తారు?ఉక్రెయిన్‌ నుంచి తిరిగివస్తున్నవారు ఆ దేశానికి, ప్రజలకు కనీసం సంఘీభావం తెలిపిన దాఖలాలు లేవు. కానీ నేహా మాత్రం ఆ దేశం కోసం తన ప్రాణాలు అర్పించేందుకు కూడా వెనకడలేదు. 

నేహా తండ్రి ఆర్మీ అధికారి యుద్ధంలో దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. నేహా తల్లి భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్న ఓ ఉపాధ్యాయిని. బహుశః అందుకేనేమో నేహాకు వారి నుంచి ఇటువంటి గొప్ప ఆలోచన, వ్యక్తిత్వం, త్యాగ గుణం అలవడ్డాయేమో? 


Related Post