కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. తెలంగాణలో పర్యటన

February 28, 2022


img

దేశంలో అత్యుత్తమ ఎన్నికల వ్యూహ నిపుణులలో ఒకరిగా పేరొందిన తెలంగాణ సిఎం కేసీఆర్‌కు ఎన్నికలలో వేరెవరివో సలహాలు, వ్యూహాలు అవసరమా? అంటే కాదని అందరికీ తెలుసు. అటువంటి కేసీఆర్‌ వచ్చే శాసనసభ ఎన్నికలలో ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్‌ కిషోర్‌  సేవలు ఉపయోగించుకోవాలనుకొంటున్నారా? అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. 

శనివారం హైదరాబాద్‌ వచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌ సిఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అంతకు ముందు నటుడు ప్రకాష్ రాజ్‌ కూడా సిఎం కేసీఆర్‌ని కలిసి ఆయన సూచన మేరకు శనివారం మల్లన్న సాగర్‌, కొండపోచ్చమ్మ సాగర్‌ ప్రాజెక్టులను చూసేందుకు వెళ్ళారు. ఆ తరువాత ప్రశాంత్‌ కిషోర్‌ కూడా సిఎం కేసీఆర్‌ సూచన మేరకు అక్కడకు చేరుకొని ప్రకాష్ రాజ్‌తో కలిసి రెండు ప్రాజెక్టును చూసి మల్లన్న సాగర్‌ నిర్వాసితులతో కూడా మాట్లాడి తిరిగి హైదరాబాద్‌ చేరుకొన్నారు. 

నిన్న ఆదివారం సిఎం కేసీఆర్‌, ప్రశాంత్‌ కిషోర్‌ గజ్వేల్‌ ఫామ్ హౌస్‌లో భేటీ అయ్యారు. వారి సమావేశం సుమారు 8 గంటల సేపు సుదీర్గంగా సాగింది. దానిలో వారిరువురూ రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై సుదీర్గంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ కిషోర్‌ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తమ బృందం సర్వే వివరాలు, అలాగే తన తెలంగాణ పర్యటనలో గమనించిన విషయాలు, రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయాలను, కొన్ని సలహాలు, సూచనలను సిఎం కేసీఆర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

సిఎం కేసీఆర్‌ కూడా తన జాతీయ రాజకీయ ప్రవేశం, ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, ఆ ప్రయత్నంలో ఇటీవల తన మహారాష్ట్ర పర్యటన, వివిద రాష్ట్రాల నేతలతో ఫోన్‌లో జరిపిన చర్చల సారాంశాన్ని ప్రశాంత్‌ కిషోర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం చివరిలో మంత్రి కేటీఆర్‌ కూడా పాల్గొని టిఆర్ఎస్‌ పార్టీ తరపున రాష్ట్ర రాజకీయాలపై ఓ నివేదిక వారికి సమర్పించినట్లు తెలుస్తోంది. 

సిఎం కేసీఆర్‌, ప్రశాంత్‌ కిషోర్‌ ఇంత సుదీర్గంగా సమావేశం కావడం గమనిస్తే, వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వారిరువురూ కలిసి పనిచేయబోతున్నారని స్పష్టం అవుతోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు సమయం ఉండగా సిఎం కేసీఆర్‌ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభిస్తుండటం విశేషం. 


Related Post