‘భీమ్లా నాయక్...ఫ్యాన్స్ వెయింటింగ్ ఇక్కడ...’ అంటూ సినిమాలో రానా చెప్పిన డైలాగ్ నిజంగానే పవన్ కల్యాణ్ అభిమానులకు వర్తిస్తుంది. కానీ ఏపీలో ప్రభుత్వ నియమనిబందనలతో థియేటర్లలో భీమ్లా నాయక్ ప్రదర్శనకు అడుగడుగునా అవరోధాలు ఏర్పడుతున్నాయి. కొన్ని చోట్ల థియేటర్ల యజమానులు ‘ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం టికెట్ ధరలతో సినిమాను ప్రదర్శించలేమంటూ..’ బోర్డులు తగిలించి థియేటర్లు మూసివేశారు. మరికొన్ని చోట్ల ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే సినిమా టికెట్స్ అమ్మాలని లేకుంటే కటిన చర్యలు తీసుకొంటామని అధికారులు హెచ్చరిస్తుండటంతో ఏ క్షణంలో ఏ అధికారి వచ్చి మీద పది థియేటర్ మూయించేస్తాడో అని భయపడుతూ మరికొందరు సినిమాను ప్రదర్శిస్తున్నారు.
పవన్ కల్యాణ్‌పై రాజకీయ కక్ష సాధింపుగానే ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమాను నిబందనల పేరుతో ప్రభుత్వమే అడ్డుకొంటోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిన్న జీ3 సినిమా కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని వస్తున్నప్పుడు పవన్ అభిమానులు స్తూ రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. పవన్ కల్యాణ్ సినిమాకు అవరోధాలు కల్పిస్తూ మళ్ళీ భీమ్లా నాయక్ సినిమాతో ప్రారంభం అవుతున్న జీ3 ప్రారంభోత్సవానికి ఎలా వచ్చారంటూ వారు ఎద్దేవా చేశారు.
విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో కొన్ని చోట్ల థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా మూసివేయగా మరికొన్ని చోట్ల థియేటర్ల ముందు అభిమానులు ఆందోళనలతో అట్టుడికిపోయాయి.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమాలను నిబందనల పేరుతో థియేటర్లలో ప్రదర్శించలేని పరిస్థితులు కల్పిస్తూ ప్రభుత్వమే ఇబ్బందులు సృష్టిస్తుంటే సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావడం మాట దేవుడెరుగు...తెలంగాణకే పరిమితమయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇప్పటికే శేఖర్ కమ్ముల వంటి దర్శకులు తెలంగాణ యాస, భాషతో, సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే చక్కటి సినిమాలు తీస్తూ వరుసగా హిట్స్ కొడుతుండటం అందరికీ తెలుసు.
ఏపీ ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా ఏపీలో పెద్ద సినిమాలు విడుదల చేయలేని దుస్థితి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి అంతటివాడు చేతులు జోడించి సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రార్ధించినా ప్రభుత్వం కనికరించలేదు. ఏపీలో ఇవే పరిస్థితులు కొనసాగితే ఇక నిర్మాతలు పెద్ద బడ్జెట్ సినిమాలు తగ్గించి ఓటీటీలకు సరిపోయే చిన్న బడ్జెట్ సినిమాలకు మొగ్గు చూపే అవకాశం ఉంది. కనుక రాజకీయ కారణాలతో సినీ పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలు మానుకొంటే అందరికీ మంచిది.