ఓ పక్క రష్యా ఉక్రెయిన్‌పై భీకర దాడులు కొనసాగిస్తుంటే, అమెరికా, నాటో దేశాలు యుద్ధంలో దిగడం ప్రమాదమని భావిస్తూ రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. తమ హితోక్తులు పట్టించుకోకుండా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగినందుకు ప్రతీకారంగా రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని, అంతరిక్ష, ఆయుధ పరిజ్ఞానాన్ని మళ్ళీ కోలుకోలేనివిదంగా దెబ్బ తీస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. తమ మిత్రదేశాలన్నిటితో మాట్లాడి రష్యాపై ఆర్ధిక, వాణిజ్య, దౌత్యపరమైన ఆంక్షలు కూడా విధిస్తామని హెచ్చరించారు. రష్యాను దెబ్బతీసేందుకు తమ ముందున్న ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటామని జో బైడెన్ విస్పష్టంగా చెప్పారు.
ప్రధాని నరేంద్రమోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌లు రష్యా అధ్యక్షుడు పుతీన్‌తో ఫోన్లో మాట్లాడి యుద్దం విరమించుకోవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, యుద్ధం అనివార్యమని పుతీన్ తేల్చి చెప్పారు. కనుక వివిద దేశాల హితోక్తులను, హెచ్చరికలను, ఆంక్షలను ఏమాత్రం ఖాతరు చేయకుండా పుతీన్ ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తున్నారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనపరుచుకొనే వరకు యుద్ధం ముగిసే అవకాశం లేదు కానీ ఆలోగా ఎంత మంది చనిపోతారో ఎంత విధ్వంసం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటువంటి సందర్భాలలో ఎప్పుడూ తటస్థంగా ఉండే భారత్ కనీసం ఇప్పుడైనా తెగువ చూపగలిగితే బాగుంటుంది.