పుతిన్‌కు మోడీ ఫోన్‌...తగ్గేదేలే

February 25, 2022


img

ప్రధాని నరేంద్రమోడీ గురువారం రాత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్‌ చేసి ఉక్రెయిన్‌పై యుద్ధం తక్షణం నిలిపేయాలని విజ్ఞప్తి చేశారు. దౌత్య మార్గాల ద్వారా చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌లో వేలాదిమంది భారతీయులు, విద్యార్దులు ఉన్నారని వారి భద్రతపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని తెలిపారు. 

అయితే పుతిన్‌ ఉక్రెయిన్‌పై యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించారు తప్ప ప్రధాని మోడీ విజ్ఞప్తిని మన్నించి యుద్ధం ఆపుతామని హామీ ఇవ్వలేదు. కనీసం ఉక్రెయిన్‌లో చిక్కుకొన్న భారతీయుల భద్రతకు హామీ కూడా ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే ప్రధాని కార్యాలయం ఆ విషయం మీడియాకు తెలియజేసేది. పుతీన్, మోడీ ఫోన్లో మాట్లాడుకొంటున్న సమయంలో కూడా రష్యా దళాలు ఉక్రెయిన్‌ దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. అంటే పుతిన్ తగ్గేదేలే...అని స్పష్టంగా చెప్పినట్లే భావించవచ్చు. 

భారత్‌-రష్యాల మద్య దశాబ్ధాలుగా బలమైన మైత్రి సంబంధాలు ఉన్నాయి. అందుకే అమెరికా ఎన్ని అభ్యంతరాలు చెపుతున్న రష్యా నుంచి భారత్‌ ఆయుధ సామాగ్రి కొనుగోలు చేస్తూనే ఉంది. ఇటీవలే 5,000 కోట్లు విలువగల 5 లక్షల ఏకే-203 రైఫిల్స్ భారత్‌లో తయారుచేసి ఇచ్చేందుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకొంది. భారత్‌కు ఆయుధాల అమ్మకాల ద్వారా రష్యాకు భారీగా ఆదాయం సమకూరుతోంది కనుకనే పుతిన్ భారత్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు. సాధారణంగా విదేశీ పర్యటనలకు ఆసక్తి చూపని పుతీన్ అందుకే గత ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలో భారత్‌ పర్యటనకు వచ్చారు. భారత్‌కు ఇస్తున్న ఆ ప్రాధాన్యత తమ వ్యాపార అవసరాల కోసమే తప్ప ఇటువంటి సందర్భాలకు కాదని పుతీన్ నిన్న చెప్పకనే చెప్పారు. కనుక భారత్‌ కూడా రష్యా పట్ల తన వైఖరిని మార్చుకొంటుందేమో చూడాలి. 


Related Post