గత ఏడాది ఆగస్ట్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వెళ్ళిపోయినప్పటి నుంచి తాలిబన్ల చేతిలో ఆఫ్ఘన్ ప్రజలు నలిగిపోతున్నారు. గత ఏడు నెలలుగా అత్యంత దయనీయమైన పరిస్థితులలో భారంగా జీవిస్తున్నారు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
ఇప్పుడు రష్యా సేనల దాడులతో ఉక్రెయిన్ ప్రజలకు అటువంటి దుస్థితే ఎదురవబోతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో పోలిస్తే ఉక్రెయిన్ చాలా అభివృద్ధి చెందిన దేశమే కానీ రష్యా దాడులతో ఇప్పుడు సర్వనాశనం అవుతోంది. ఒకవేళ ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచేందుకు అమెరికా లేదా నాటో దళాలు కలుగజేసుకొంటే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది కనుక అవి కలుగజేసుకోకపోవచ్చు. ఒకవేళ కలుగజేసుకొన్నా ఉక్రెయిన్ వేదికగా వాటికి రష్యాకు మద్య జరిగే యుద్ధంలో ఉక్రెయిన్ సర్వనాశనం అవడం ఖాయం. కనుక ఏవిదంగా చూసినా ఉక్రెయిన్ నష్టపోక తప్పదని స్పష్టం అవుతోంది.
ఈ యుద్ధం ఇంకా ఎప్పటికీ ముగుస్తుందో ఎవరికీ తెలీదు. అది ముగిసిన తరువాత ఉక్రెయిన్ తేరుకోవడానికి దశాబ్ధాలు పట్టవచ్చు లేదా ఎన్నటికీ తేరుకోలేనివిదంగా రష్యా దెబ్బతీయవచ్చు. కనుక ఉక్రెయిన్ భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తోంది.
ఆనాడు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకొంటుంటే ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచ దేశాలన్నీ ప్రేక్షక పాత్ర పోషించాయి. ఇప్పుడూ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తుంటే నిస్సహాయంగా చూస్తున్నాయి. కనుక ఉక్రెయిన్ ప్రజలు తమను రష్యా బారి నుంచి కాపాడమని ఆ భగవంతుడుని వేడుకోవలసిందే.