సిఎం కేసీఆర్, ముంబై వెళ్ళి మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రేతో భేటీ అయిన తరువాత బిజెపికి వ్యతిరేకంగా కేసీఆర్ మొదలుపెట్టిన పోరాటానికి శివసేన పూర్తి మద్దతు ఉంటుందని థాక్రే విస్పష్టంగా ప్రకటించారు. వారి సమావేశంలో పాల్గొన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అదే రోజు నాగపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “అనేక డక్కామొక్కీలు తిని రాటుతేలిన రాజకీయ నాయకుడు కేసీఆర్. కనుక దేశంలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయగల సత్తా ఆయన ఒక్కరికే ఉంది. అయితే కాంగ్రెస్‌ని కలుపుకోకుండా కూటమి సాధ్యం కాదు. కనుక కూటమిలో కాంగ్రెస్ తప్పకుండా భాగస్వామిగా ఉండాలి. కాంగ్రెస్ లేని కూటమికి మేము అంగీకరిస్తున్నట్లు ఎన్నడూ చెప్పలేదు. కూటమి ఏర్పాటుపై మా ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే త్వరలో కేసీఆర్‌ను కలిసినప్పుడు ఈ అంశంపై కూడా మాట్లాడుతారు,” అని అన్నారు.
సిఎం కేసీఆర్ ముంబై నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేలోగానే శివసేన ఎంపీ ఈవిదంగా మాట్లాడటం పెద్ద షాక్ అనే చెప్పాలి. నిజానికి ముఖ్యమంత్రుల సమావేశంలోనే ఉద్దవ్ థాక్రే ఈవిషయం సిఎం కేసీఆర్‌కు చెప్పే ఉంటారు. కానీ సంయుక్త ప్రకటనలో ఈ ప్రస్తావన చేయలేదు. కనుక సంజయ్ రౌత్ కూడా దీనిపై బహిరంగంగా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. కానీ మాట్లాడి సిఎం కేసీఆర్‌కు ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించారని చెప్పవచ్చు.
దీంతో రాష్ట్ర బిజెపి నేతలు కాంగ్రెస్, టిఆర్ఎస్‌ల మద్య రహస్య అవగాహన ఉందనే తమ వాదనలు నిజమని కేసీఆర్ స్వయంగా రుజువు చేశారని వాదించడం మొదలుపెడతారు.