నిన్న ఆదివారం ముంబైలో తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. తరువాత సిఎం కేసీఆర్ బృందం ఎన్‌సీపీ అధినేత శరత్ పవార్‌తో భేటీ అయ్యారు. ఈ రెండు సమావేశాలలో నటుడు ప్రకాష్ రాజ్ కూడా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రకాష్ రాజ్ కూడా బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ఆయన సిఎం కేసీఆర్‌కు సన్నిహితుడు కూడా. కనుక ఆయనను వెంటబెట్టుకొని వెళ్ళి ఉండవచ్చు. కానీ దేశంలో...రాష్ట్రంలో బిజెపిని, మోడీని వ్యతిరేకించే రాజకీయ నేతలు చాలా మందే ఉన్నారు కదా?కానీ ప్రకాష్ రాజే ఎందుకు?అనే ప్రశ్నకు సమాధానం కొంచెం పెద్దదే.
ప్రకాష్ రాజ్ కర్నాటకకు చెందినవారని తెలిసిందే. కర్నాటకలో బిజెపిని వ్యతిరేకిస్తున్న దేవగౌడ కుటుంబానికి ఆయన ఆప్తుడు. దేవగౌడ కుటుంబానికి, సిఎం కేసీఆర్‌కు మద్య వారదిగా ప్రకాష్ రాజ్ ఉన్నారు. గతంలో సిఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొన్నప్పుడు కేసీఆర్, దేవగౌడల సమావేశానికి ప్రకాష్ రాజ్ కూడా హాజరయ్యారు.
ప్రకాష్ రాజ్ అటు హిందీ, ఇటు దక్షిణాది భాషలలో పలు సినిమాల ద్వారా అందరికీ సుపరిచితుడు. కనుక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో వాటి నేతలతో ప్రకాష్ రాజ్‌కు మంచి పరిచయాలే ఉన్నాయి. దేశ రాజకీయాల పట్ల మంచి అవగాహనం కలవారు. మంచి వాగ్దాటి కలవారు. ముఖ్యంగా బిజెపి, నరేంద్రమోడీలకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడే ధైర్యం చాలా ఉంది. కనుక భవిష్యత్‌లో ‘కేసీఆర్ కూటమి’ ప్రజలలోకి వెళ్ళాల్సినప్పుడు ప్రకాష్ రాజ్ వంటి సుపరిచితుడు ఉంటే సులువుగా ప్రజలను ఆకట్టుకోవచ్చు. ముఖ్యంగా దక్షిణాది ప్రజలను ఆకట్టుకొని వారిని తమ కూటమివైపు మళ్ళించడంలో ప్రకాష్ రాజ్, ఆయనకున్న పరిచయాలు, పరపతి చాలా తోడ్పడవచ్చని సిఎం కేసీఆర్ భావిస్తుండవచ్చు. బహుశః అందుకే ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనే అవకాశం ఆయనకు లభించిందని భావించవచ్చు.