సిఎం కేసీఆర్‌ వాదనతో పవార్‌ ఏకీభవించలేదా?

February 21, 2022


img

సిఎం కేసీఆర్‌ నిన్న ముంబై వెళ్ళి మొదట మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రేతో భేటీ అయ్యారు. తరువాత ఎన్‌సీపీ అధినేత శరత్ పవార్‌తో భేటీ అయ్యి జాతీయ రాజకీయాలు, బిజెపిని సమిష్టిగా ఎదుర్కోవడం తదితర అంశాలపై సుమారు రెండు గంటల సేపు చర్చించారు. తరువాత ఇరువురూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

శరత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ, “మా సమావేశంలో దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల సమస్యలు, దేశాభివృద్ధిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. రాజకీయాల గురించి పెద్దగా చర్చించలేదు. దేశాభివృద్ధికి ఓ కొత్త అజెండా అవసరమని మేము భావిస్తున్నాము. మళ్ళీ అవసరమైతే మేము మళ్ళీ కలుస్తాము,” అని అన్నారు.            

అయితే బిజెపిని అడ్డుకోవడానికి కలిసివచ్చే పార్టీలతో చర్చలు జరుపుతున్నామని సిఎం కేసీఆర్‌ విస్పష్టంగా చెపుతున్నప్పుడు, తమ సమావేశంలో రాజకీయాలపై పెద్దగా చర్చ జరగలేదని శరత్ పవార్ చెప్పడం విశేషం. వారి సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్‌ను కలుపుకోకుండా కూటమి ఏర్పాటు సాధ్యాసాధ్యాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్‌ బలహీనపడిందని కనుక దానిని కలుపుకోకుండా ప్రాంతీయ పార్టీలతో బిజెపికి ప్రత్యామ్నాయంగా బలమైన కూటమి ఏర్పాటు చేయవచ్చని సిఎం కేసీఆర్‌ శరత్ పవార్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే శరత్ పవర్ చాలా సీనియర్ రాజకీయ నాయకుడు కనుక  కాంగ్రెస్ రహిత కూటమి ఫలిస్తుందా లేదా? సిఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయాలా వద్దా? అనేది నిర్ణయించుకొంటారు. బహుశః అందుకే మీడియా ముందు సంయుక్త ప్రకటనలో ఉద్దవ్ థాక్రేలాగ సిఎం కేసీఆర్‌ పోరాటంలో పాల్గొంటామని కానీ మద్దతు తెలుపుతున్నట్లు గానీ ప్రకటించలేదని భావించవచ్చు. 


Related Post