తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులలో ఒకరైన మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ప్రోమోషన్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దానిలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సినీ పరిశ్రమలో చిరంజీవి తదితరులు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి సినిమా టికెట్స్ తగ్గింపు, సినీ పరిశ్రమకు సంబందించిన ఇతర సమస్యలపై చర్చించిన సంగతి తెలిసిందే.
మోహన్ బాబు స్పందిస్తూ, “సినీ పరిశ్రమలో అందరూ కలిసి కూర్చొని చర్చించుకొన్నాక అందరూ కలిసి వెళ్ళి ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలని నేను ఇదివరకే చెప్పాను. కానీ అప్పుడు కూర్చొని చర్చించుకొనేందుకు ఎవరికీ ఖాళీలేదని చెప్పారు. తరువాత నలుగురు మాట్లాడుకొని వెళ్ళి సిఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడివచ్చారు. ఆ చర్చలకు నన్ను కూడా సీఎంవో ఆహ్వానించింది కానీ కావాలనే వారు నన్ను కలుపుకోకుండా వెళ్ళి మాట్లాడివచ్చారు. ఒకప్పుడు సినీ పరిశ్రమలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కలిసి మెలిసి మెలుగుతూ సమస్యల గురించి చర్చించుకొనేవారిమి. కానీ ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎవరికి వారు నేనే గొప్ప అనుకొంటూ ఎదుటవారికి గోతులు తవ్వుతూ రాజకీయాలు చేస్తున్నారు. అయితే సినీ పరిశ్రమలో ఎవరూ ఎవరి కంటే గొప్ప కాదు... ఎవరూ ఇక్కడ శాస్వితంగా ఉండిపోరని గ్రహిస్తే మంచిది. మనం చేసే మంచి చెడులన్నిటినీ పైనుంచి ఆ భగవంతుడు గమనిస్తుంటాడని నేను నమ్ముతున్నాను. కనుక నా పట్ల సినీ పరిశ్రమలో కొందరు ఎలా ప్రవర్తిస్తున్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోతున్నాను. నా గురించి ఎవరో ఏదో అనుకొంటే విని బాధపడే తీరిక, ఓపిక రెండూ నాకు లేవు,” అని అన్నారు.
గతంలో ఓసారి ‘తెలుగు సినీ పరిశ్రమలో లెజండ్ ఎవరు?’ అనే దానిపై చిరంజీవికి మోహన్ బాబుకి మద్య కొంతకాలం వివాదం నడిచింది. ఆ తరువాత ఇద్దరూ సర్దుకుపోవడంతో ఆ వివాదం సమసిపోయింది. సినీ పరిశ్రమలో అందరి కంటే సీనియర్ నటుడైన తనను పక్కన పెట్టి చిరంజీవి కొందరు నటులు, దర్శకులను వెంటబెట్టుకొని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినందుకే మోహన్ బాబు ఈవిదంగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.