నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిన సిఎం కేసీఆర్ కలిసివచ్చే పార్టీల అధినేతలతో చర్చలు మొదలుపెట్టారు. ఇదే పనిమీద ఈ నెల 20న ముంబై వెళ్ళి మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రేతో భేటీ కానున్నారు. అయితే బీజేపీ మతతత్వవిదానాలను తప్పు పడుతూ మళ్ళీ మతతత్వ శివసేనతో సిఎం కేసీఆర్ చేతులు కలపడానికి సిద్దపడుతుండటం విశేషం!
శివసేన, బిజెపి రెండూ కూడా హిందుత్వ అజెండాతోనే పనిచేస్తాయి కనుక ఇదివరకు రెండు మిత్రపక్షాలుగా మెలుగుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉండేవి. అయితే మహారాష్ట్రలో అధికారం, పదవుల పంపకాలలో వాటి మద్య భేదాభిప్రాయాలు రావడంతో దూరమయ్యి ఇప్పుడు శత్రువులుగా మారాయి. శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అవుతాడు కనుక బిజెపి శత్రువైన శివసేనతో సిఎం కేసీఆర్ చేతులు కలిపేందుకు సిద్దపడుతుండటం సహజమే కావచ్చు.
అయితే రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు మిత్రపక్షంగా మజ్లీస్ పార్టీకి శివసేనలకు మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎందుకంటే రెండూ మతతత్వపార్టీలే... మతం ఆధారంగానే రాజకీయాలు చేస్తుంటాయి కనుక. మరి తమను తొడగొట్టి మరీ సవాలు చేస్తున్న మజ్లీస్ పార్టీతో దోస్తీ కొనసాగిస్తున్న సిఎం కేసీఆర్‌తో శివసేన దోస్తీకి అంగీకరిస్తుందా? అలాగే శివసేనతో కేసీఆర్ దోస్తీని మజ్లీస్ అధినేతలు ఓవైసీలు అంగీకరిస్తారా? ఒకవేళ శివసేనతో సిఎం కేసీఆర్ దోస్తీ చేయగలిగితే, రెండు పూర్తి భిన్నమైన మతతత్వ పార్టీలను వెంటబెట్టుకొని మరో మతతత్వ పార్టీ అయిన బిజెపిని ఎదుర్కొనేందుకు బయలుదేరుతున్న మాట!