కాంగ్రెస్‌తో పొత్తులకి సిఎం కేసీఆర్‌ సంకేతాలు?

February 14, 2022


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని తన యుద్ధం కొనసాగిస్తున్నారు. ఈ యుద్ధంలో బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీని దేశం నుంచి తరిమి కొట్టేందుకు కలిసివచ్చే అన్ని పార్టీలతో ముందుకు సాగాలనుకొంటున్నట్లు చెప్పారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఓ విలేఖరి “‘అయితే కాంగ్రెస్ పార్టీని కూడా మీతో కలుపుకొంటారా?’ అనే ప్రశ్నకు సిఎం కేసీఆర్‌ సమాధానం దాటవేశారు. 

“భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో...ఎవరెవరు కలుస్తారో ఇప్పుడే చెప్పలేను. ముందుగా బిజెపిని గద్దె దించి తరిమికొట్టడమే ప్రధాన లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలి. ఆ తరువాత ఏమి జరుగుతుందో... ఎవరు దేశాన్ని పాలిస్తారో...ఎవరు ప్రధాని అవుతారో.. అనేవి తరువాత తేల్చుకోవచ్చు,” అని అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్దమనే సంకేతం ఇచ్చినట్లే భావించవచ్చు. 

అలాగే ప్రెస్‌మీట్‌ రాహుల్ గాంధీని గట్టిగా వెనకేసుకువచ్చారు. అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీపై వ్యక్తిగత దూషణలు చేయడాన్ని ఖండిస్తున్నానని చెపుతూ నెహ్రూ కుటుంబం ఎంత గొప్పదో చెప్పారు. తాను ఎన్నడూ సోనియా గాంధీ గురించి తప్పుగా మాట్లాడలేదని అన్నారు. 

సిఎం కేసీఆర్‌ ఈవిదంగా కాంగ్రెస్‌ గురించి సానుకూలంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌తో దోస్తీకి స్నేహ హస్తం అందిస్తూనే, ‘కాంగ్రెస్‌తో దోస్తీ’ అని ఎవరైనా అంటే అవి చిల్లరమల్లర మాటలు, చిల్లర మల్లర రాజకీయాలు చేయడమే అని అనడం విశేషం. 

“ఇంతకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌, బిజెపిలు దేశానికి పట్టిన అరిష్టం...రెంటినీ దేశం నుంచి తరిమికొట్టాల్సిందే...”అంటూ మాట్లాడే సిఎం కేసీఆర్‌ ఇప్పుడు ఎక్కడా కాంగ్రెస్‌ ప్రస్తావన చేయకుండా బిజెపిని మాత్రమే విమర్శిస్తూ, దానిని మాత్రమే తరిమికొట్టాలని చెపుతుండటం గమనిస్తే అందుకోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్దం అవుతున్నట్లు అర్ధమవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసిన సిఎం కేసీఆర్‌ ఇప్పుడు హటాత్తుగా అదే పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దపడుతుండటం నిజమైతే, అందుకు బలమైన కారణమే కనిపిస్తోంది. 

“దేశంలో కాంగ్రెస్‌ పార్టీని కలుపుకోకుండా బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ చేసినా కాంగ్రెస్‌ మద్దతు లేనిదే నిలబడలేదు. ఎందుకంటే నేటికీ దేశవ్యాప్తంగా బిజెపిని ఎదుర్కొనే పార్టీలలో కాంగ్రెస్‌ పార్టీయే ప్రధానమైనది. దానికే ఎక్కువ ఎంపీ సీట్లు సాధించే శక్తి ఉంది,” అని ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. బహుశః అందుకే సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌తో దోస్తీకి సిద్దమవుతున్నట్లున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ని నిర్వీర్యం చేసి చేజేతులా దాని కంటే చాలా బలమైన బిజెపిని తెచ్చిపెట్టుకొని సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటుండటంతో తెలంగాణలో బిజెపి దూకుడుని అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌ను మళ్ళీ ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టడం మంచిదని సిఎం కేసీఆర్‌ భావిస్తుండవచ్చు. కనుక రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణలు, బలాబలాలు కూడా మారే అవకాశం కనిపిస్తోంది. 


Related Post