నా ఆంద్రా సోదరుల ప్రేమకు పొంగిపోయాను: కేటీఆర్‌

February 12, 2022


img

టిఆర్ఎస్‌ నేతల ప్రసంగాలలో ఏపీ రాజకీయ నాయకుల కారణంగానే తెలంగాణకు ఈ దుస్థితి ఏర్పడిందనే మాట తరచూ వినబడుతూనే ఉంటుంది. అయితే నేటికీ టిఆర్ఎస్‌- ఏపీ కాంగ్రెస్‌, వైసీపీ నేతలతో సంబంధాలు చక్కగా కొనసాగిస్తూనే ఉండటం విశేషం. ఏపీ, తెలంగాణ రాజకీయ నాయకుల ఇళ్ళలో జరిగే శుభకార్యాలకు వెళ్ళి వస్తూనే ఉంటారు. చక్కగా ముచ్చట్లు చెప్పుకొని కలిసి విందు భోజనాలు చేస్తూనే ఉంటారు.   

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ శుభకార్యానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెళ్ళికి హాజరైన వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు కేటీఆర్‌ కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకొన్నారు. 

అనంతరం మంత్రి కేటీఆర్‌ ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, “ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడిని ఆశీర్వదించడానికి వెళ్లినప్పుడు అక్కడ నా ఏపీ సోదరుల ప్రేమాభిమానాలు చూసి ఉప్పొంగిపోయాను. భౌగోళికంగా ఏపీ, తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ మనుషుల మద్య ప్రేమలు, అభిమానాలు ఇంకా అలాగే నిలిచి ఉన్నాయి. చాలా సంతోషం,” అని ట్వీట్ చేశారు.  


ఏపీ, తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధుల మద్య ఇంత ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు ఇంకా పరస్పరం ఎందుకు విమర్శలు చేసుకొంటున్నారు? వివాదాలను సామరస్యంగా ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు? అని సందేహం కలుగక మానదు.


Related Post