కొద్దిసేపటి క్రితం సిఎం కేసీఆర్ జనగామలో సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వారితోపాటు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. సిఎం కేసీఆర్ ఆయన చేత కూడా కొబ్బరికాయ కొట్టించారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీ కనుక ప్రోటోకాల్ ప్రకారం సిఎం కేసీఆర్ అధికారిక కార్యక్రమంలో పాల్గొని ఉండవచ్చు. అయితే పిసిసి అధ్యక్ష పదవి ఆశించి భంగపడి, ఆ పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చినప్పటి నుంచి ఆయన నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మోడీ వ్యాఖ్యలతో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మద్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జనగామలో జరిగే బహిరంగ సభలో సిఎం కేసీఆర్ మళ్ళీ బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకు పడటం ఖాయం. కనుక ఇటువంటి సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సిఎం కేసీఆర్ పక్కన కనిపించడం ఇంకా విశేషం. టిఆర్ఎస్‌లో చేరే ఆలోచనతోనే సిఎం కేసీఆర్‌తో రాసుకు పూసుకు తిరిగారా?అనే సందేహం కలుగకమానదు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.32 కోట్లు వ్యయంతో మూడంతస్తులలో ఈ భవనాన్ని నిర్మించారు. దీనిలో జిల్లాకు చెందిన 34 శాఖల కార్యాలయాలు ఉంటాయి. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉంటాయి కనుక వివిద పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది.