గత రెండు మూడేళ్ళుగా తెలంగాణ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ నిరుద్యోగులను ఊరిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలపై అధికారులను నివేదికలు అడుగుతుండటం, తీసుకోవడంతోనే సరిపోతోంది. రాష్ట్రంలో ఏవైనా ఎన్నికలు వచ్చినప్పుడే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడుతుంటుందని ప్రతిపక్షాలు పదేపదే విమర్శలు చేస్తున్నా ఎప్పటికప్పుడు ఏవో కారణాలు చెపుతోందే తప్ప ఇంత వరకు నోటిఫికేషన్లు జారీ చేయలేదు. గత ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేసి వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. కొత్త సంవత్సరంలో రెండు నెలలు గడిచిపోయినా అది ఇంకా కొలిక్కిరాలేదు. ఇంకా ఎప్పటిలోగా ఆ ప్రక్రియ పూర్తవుతుందో తెలీదు. కానీ మళ్ళీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ వివిద శాఖలలో ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల తరువాత ఏర్పడే ఖాళీలను గుర్తించి ఆ వివరాలు సమర్పించాలని నిన్న అధికారులను ఆదేశించారు. కనుక మళ్ళీ 50వేల ఉద్యోగాల కధ మళ్ళీ మొదటికొచ్చినట్లే ఉంది.
ఒక్కో నెల గడుస్తున్న అనేకమంది నిరుద్యోగులకు వయోపరిమితి దాటిపోయి ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నారు. దీంతో ఇంతకాలం వారు ప్రభుత్వోద్యోగాలు సాధించడం కోసం తీసుకొన్న శిక్షణ, చేసిన ఖర్చు, పడిన శ్రమ, విలువైన వారి సమయం అన్నీ వృధా అయిపోతున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసి చూసి చివరికి నిరాశనిస్పృహలతో కొందరు నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకొంటున్నారు. కనుక ఇకనైనా ప్రభుత్వం వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేస్తే బాగుంటుంది. అలాగే ఒక్కొక్కరికీ రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మూడేళ్ళు గడిచిపోయాయి. ప్రభుత్వం ఆ హామీ కూడా నిలబెట్టుకొంటే బాగుంటుంది.