ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు తగ్గించి, సినిమా ప్రదర్శనలపై ఆంక్షలు విధించడంపై గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు, ఏపీ మంత్రులకు మద్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు గురువారం చిరంజీవి నేతృత్వంలో ప్రభాస్, మహేష్ బాబు, నారాయణమూర్తి, ఆలీ, పోసాని కృష్ణ మురళి, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ గురువారం తాడేపల్లి వెళ్ళి ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. వారు తమ సమస్యలను మొర పెట్టుకొని, ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించవలసిందిగా కోరగా, ఏపీ సిఎం జగన్ అటు ప్రజలకి భారం కాకుండా, సినీ పరిశ్రమ నష్టపోకుండా నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చారు. భారీ బడ్జెట్, చిన్న బడ్జెట్ సినిమాలకు తగిన విదంగా వేర్వేరు టికెట్ ధరలు నిర్ణయిస్తామని, పెద్ద సినిమాలకు బెనిఫిట్ షో వేసుకొనేందుకు అనుమతిస్తామని హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావాలని, వస్తే స్టూడియోల నిర్మాణానికి భూములు ఇస్తామని, సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇస్తామని సిఎం జగన్ చెప్పారు. సినిమాలో 20 శాతం షూటింగ్ ఏపీలో చేస్తే ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తామని చెప్పారు. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రకటిస్తామని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారని, సమావేశం చాలా సంతృప్తికరంగా సాగిందని చిరంజీవి, మహేష్ బాబు చెప్పారు.
అయితే సినీ పరిశ్రమపై ముందు కక్ష కట్టినట్లు వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం, ఇప్పుడు సానుకూలంగా వ్యవహరిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఏపీ ప్రభుత్వం గత రెండు నెలలుగా వ్యవహరించిన తీరు, దానితో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్ళ నేపధ్యంలో సినీ పరిశ్రమ ఏపీకి తరలివెళ్ళే సాహసం చేస్తుందనుకోలేము. టికెట్ల ధరలు పెంపుపై ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొంటుందో, ఏపీకి సినీ పరిశ్రమ తరలిరావాలనే ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తిపై సినీ పరిశ్రమ ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.