ఏపీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడిన తరువాత టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఒత్తిడి మేరకు మోడీ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసింది. పోలవరం ముంపు ప్రాంతాలైన అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టుకు అవరోధాలు ఏర్పడవచ్చనే ఉద్దేశ్యంతో వాటిని ఏపీలో విలీనం చేసినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది.
అయితే దశాబ్ధాల క్రితం మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టు నేటికీ పూర్తికాలేదు. ఇంకా ఎప్పటికైనా పూర్తవుతుందో లేదో ఎవరికీ తెలీదు. ఇక ముంపు ప్రాంతాలను ఏపీలో విలీనం చేసిన తరువాత ఆ గ్రామాలలో ప్రజల కష్టాలు పట్టించుకొనే నాధుడే లేడు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కనుక ఏపీలోని గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, ఏటపాక, పురుషోత్తపట్నం ఐదు పంచాయితీలను తెలంగాణలో విలీనం చేయాలంటూ అఖిలపక్షాల అధ్వర్యంలో నేడు భద్రాచలం పట్టణంతో పాటు ఆ ఐదు గ్రామాలలో ప్రజలు బంద్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలోనే ఈ 5 పంచాయితీలను మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేస్తూ బిల్లు ప్రవేశపెట్టాలని అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీ ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగోలేనప్పటికీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కంటే సంక్షేమ పధకాలు ప్రకటించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్న సంగతి అందరికీ తెలుసు. ఏపీ ప్రభుత్వం నెలకు కనీసం ఒకటి రెండు సంక్షేమ పధకాలకు వందల కోట్లు విడుదల చేస్తుంటుంది. అయినప్పటికీ ఏపీలో విలీన గ్రామాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉండాలని కోరుకొంటుండటం విశేషం!
మహారాష్ట్రలో తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని, తమ ప్రాంతాలలో కూడా టిఆర్ఎస్ పోటీ చేస్తే గెలిపించుకొంటామని చెపుతుండటం తెలంగాణ అభివృద్ధికి, టిఆర్ఎస్ పాలనకు గీటురాయిగా చెప్పుకోవచ్చు.