తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మళ్ళీ వేడెక్కింది. దీనిపై టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల వాదనలు చాలా విచిత్రంగా ఉన్నాయి.
కాంగ్రెస్ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం హడావుడిగా రాష్ట్ర విభజన చేయడం వలన రెండు తెలుగు రాష్ట్రాల మద్య వివాదాలు కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు తప్ప తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడలేదని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఆనాడు బిజెపి కూడా తెలంగాణ ఏర్పాటుకి మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇది వాస్తవం కూడా. అయితే తెలంగాణ బిల్లుకి పార్లమెంటులో మద్దతు ఇచ్చి రాష్ట్రం ఏర్పాటుకు అన్ని విధాలా బిజెపి సహకరించినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ ఈవిదంగా అనడం సరికాదనే చెప్పాలి.
హుజూరాబాద్ ఓటమితో షాక్ తిన్న టిఆర్ఎస్, రాష్ట్రంలో బిజెపికి అడ్డుకట్టవేయకపోతే వచ్చే ఎన్నికలలో అధికారం చేజారిపోతుందని భయపడుతోంది కనుకనే అంతకు ముందు ‘రాష్ట్రంలో బిజెపి ఎక్కడుంది...?’ అని ప్రశ్నించిన విషయం మరిచిపోయి ఇప్పుడు నిత్యం బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ జపం చేస్తోంది.
ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు టిఆర్ఎస్ దానినే తమ ప్రధాన శత్రువుగా భావించి ఓ పద్దతి ప్రకారం దానిని నిర్వీర్యం చేయడం అందరికీ తెలుసు. ఇప్పుడు బిజెపితో టిఆర్ఎస్‌కు ప్రమాదం కనిపిస్తోంది కనుక దానిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు టిఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోందని చెప్పవచ్చు. అందుకే మోడీ శ్రీరామానుజచార్యుల విగ్రహాన్ని అవివిష్కరించినా టిఆర్ఎస్ తప్పు పడుతోంది...ఇప్పుడు మోడీ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకొని హడావుడి చేస్తోందని భావించవచ్చు.
ఇక ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలతో సిఎం కేసీఆర్‌కు ‘తెలంగాణ సెంటిమెంట్ అనే ఆక్సిజన్’ అందజేసి, క్రుంగిపోతున్న గులాబీ కారును జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అడ్డు తొలగించుకొనేందుకే టిఆర్ఎస్, బిజెపిలు కలిసి ఈ కొత్త డ్రామా మొదలుపెట్టాయని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోయిందంటూ మొసలి కన్నీళ్లు కార్చుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఇంతవరకు విభజన హామీలను ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధిష్టానం తన పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చిందని రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు అందరూ చెపుతుంటారు. అంటే ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లుగా కాంగ్రెస్ తన రాజకీయ లాభ నష్టాలను బేరీజు వేసుకొని, ఏపీలో నష్టపోయినా తెలంగాణ ఇచ్చినందుకు ఇక్కడ తప్పకుండా అధికారంలోకి రాగలమనే నమ్మకంతోనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు చేసిందని స్పష్టమవుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అడ్డుకొనేందుకు అంతకంటే బలమైన బిజెపిని తెచ్చిపెట్టుకోవాలని ఎవరూ అనుకోరు. కానీ భవిష్యత్‌లో బిజెపి ఇంత బలపడుతుందని ఊహించని సిఎం కేసీఆర్ అప్పటికే చాలా బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడం వలననే దాని స్థానంలోకి బిజెపి వచ్చిందని అందరికీ తెలుసు. కనుక రేవంత్ రెడ్డి వాదన అర్ధరహితంగా ఉందని చెప్పక తప్పదు.
ఈవిదంగా ఈ మూడు పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరులో చేతికి ఏది అందివస్తే దానిని అస్త్రంగా మార్చుకొని మూడూ రాజకీయ మైలేజీ పొందాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే నిజానిజాలు, పార్టీల అంతరంగాలు ప్రజలకు కూడా బాగా తెలుసనే విషయం మూడు పార్టీలకు కూడా తెలుసు. అయినా రాజకీయ మైలేజీ కోసం దేని ప్రయత్నాలు అవి చేసుకొంటున్నాయి.