సింగరేణి గనుల వేలం కధలో ఈ ట్విస్ట్ ఏమిటో

February 09, 2022


img

కేంద్రప్రభుత్వం సింగరేణిలోని నాలుగు బొగ్గు గనులతో సహా దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలోని బొగ్గు గనులను వేలం వేస్తోంది. అయితే సింగరేణిలోని గనులను వేలం వేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్‌, దాని అనుబంద టిబిజికెఎస్ కార్మిక సంఘం, సింగరేణి సంస్థ అన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషీకి ఈ మేరకు ఘాటుగా ఓ లేఖ కూడా వ్రాశారు. 

బొగ్గు గనుల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సింగరేణి సంస్థ ఒడిశాలోని బంఖూయ్‌ కోల్ బ్లాకు వేలం పాటలో తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కంపెనీలతో పోటీ పడటం విశేషం. మంగళవారం ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ నిర్వహించిన వేలంపాటలో సింగరేణి కూడా బిడ్స్ దాఖలు చేసింది. ఆ బ్లాకులో సుమారు 800 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నందున ఏడాదికి సుమారు 10 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వి తీయవచ్చు. కనుక దానిని దక్కించుకోవడానికి సింగరేణి, తమిళనాడుకి చెందిన జెన్కో, ఒడిశాకు చెందిన ఎజ్గని పవర్ లిమిటెడ్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కనుక సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే ఈ వేలంపాటలో పాల్గొందని భావించవచ్చు. కానీ ఓ వైపు బొగ్గు గనుల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు వేలంపాటలో  సింగరేణి ఎందుకు పాల్గొంది? తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అనుమతించింది? అని సందేహం కలుగక మానవు. 

సింగరేణిలో కళ్యాణిఖని బ్లాకు-6, కోయగూడెం బ్లాకు-3, సత్తుపల్లిలోని బ్లాకు-3, శ్రావణపల్లి గనులకు 2021 డిసెంబరులోనే వేలంపాట జరిగింది. అయితే వాటి వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనలేదు! వాటి కోసం వేరే రాష్ట్రాలు..కంపెనీలు ముందుకు రాలేదు కనుకనే  సింగరేణి వేలంలో పాల్గొనలేదేమో? కానీ అవి చేజారిపోకుండా కాపాడుకోవాలనుకుంటే సింగరేణి వేలంపాటలో పాల్గొని వాటిని దక్కించుకొనే ప్రయత్నం చేసి ఉండాలి కదా?సింగరేణిలో బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, మళ్ళీ దేశంలో ఇతర రాష్ట్రాలలో బొగ్గు గనుల కోసం జరిగే వేలంపాటలో సింగరేణి పాల్గొనడానికి అర్ధం ఏమిటి?


Related Post