తెదేపా పరువు తీస్తున్న ఆ రెండు ఫోటోలు!

October 08, 2016


img

వంద మాటల్లో చెప్పలేని విషయం ఒక్క చిన్న ఫోటోతో చెప్పవచ్చని ఫోటోగ్రాఫర్స్ అంటుంటారు. ఈ రెండు ఫోటోలని చూస్తే అది నిజమని ఒప్పుకోక తప్పదు. విశేషం ఏమిటంటే ఆ రెండు ఫోటోలు కూడా తెదేపాకి చెందినవే కావడం. సాధారణంగా రాజకీయ నేతలు నోరుజారి చిక్కులో పడుతుంటారు. కానీ ఈసారి కేవలం రెండు ఫోటోలే తెదేపా పరువు తీస్తున్నాయి. ఒకటి ప్రచారార్భాటం కోసం తీసినదికాగా  మరొకటి తెదేపాని తీవ్రంగా వ్యతిరేకించే సాక్షి పత్రిక తీసినది. 

మొదటి దానిలో తెదేపా మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ కి కంప్యూటర్ శిక్షణ పొందుతున్నట్లు తీసినది. కానీ కంప్యూటర్ ఆన్ చేయకుండానే శిక్షణ తీసుకొంటున్న ఫోటోని మీడియాకి విడుదల చేయడమే తెదేపా పరువు తీసింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్నా అత్యాధునిక టెక్నాలజీని వాడుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారని అందరికీ తెలుసు. “అప్-డేట్ కాకపోతే అవుట్-డేట్ అయిపోతారని” అనే ఒక మంచి పంచ్ డైలాగ్ కూడా కొట్టారాయన. కేవలం తనొక్కడే అప్-డేట్ అయితే సరిపోదని గ్రహించిన ఆయన తన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు అందరికీ ఐటి విద్యార్ధుల చేత కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎంత చిన్న విషయానికైనా ప్రచారం కోరుకొనే చంద్రబాబు, తన పార్టీ నేతలు కంప్యూటర్ శిక్షణ తీసుకొంటున్న విషయం గురించి కూడా ప్రచారం చేసుకోవాలనుకొన్నారు. కానీ అసలు కంప్యూటర్ ఆన్ చేయకుండానే సదరు నేత శిక్షణ తీసుకొంటున్న ఫోటో అప్-లోడ్ చేయడంతో పార్టీ పరువు పోయింది. 


ఇక రెండవ ఫోటో ఇటీవల గుంటూరులో జరిగిన తెదేపా మేధోమధనం సదస్సులో తీసినది. దానిలో ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్పకి వేలు చూపిస్తూ ఏదో హెచ్చరిస్తున్నట్లుంది. అప్పుడు రాష్ట్ర హోం మంత్రి బిక్క మొహం వేసి నారా లోకేష్ వైపు చూస్తుండటం ఫోటోలో చూడవచ్చు.

ప్రభుత్వంలో ఏ పదవీ నిర్వహించని నారా లోకేష్, సాక్షాత్ రాష్ట్ర హోం మంత్రిని చంటి పిల్లాడిని మందలిస్తున్నట్లుగా మందలించడం ఆ ఫోటోలో చూడవచ్చు. తనకంటే వయసులో, రాజకీయ అనుభవంలో, పదవిలో అన్ని విధాలుగా పెద్దవాడైన హోంమంత్రిని లోకేష్ మందలించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రాష్ట్రంలో పోలీసులందరికీ బాస్ వంటి హోంమంత్రి లోకేష్ ముందు భయపడుతూ నిలబడితే ఇంక ఆయన మాట ఎవరు వింటారు అని వైకాపా ప్రశ్నిస్తోంది. నిజమే కదా? 


Related Post