సింగరేణిపై రాజకీయా యుద్ధం తప్పదా?

February 07, 2022


img

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర బొగ్గుశాఖా మంత్రి ప్రల్హాద్ జోషికి లేఖ వ్రాశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సింగరేణి లాభాల బాటలో పయనిస్తోందని, దానిని ప్రైవేట్ పరం చేస్తే నష్టపోక తప్పదని కనుక సింగరేణి గనుల వేలంపాట ఆలోచనను విరమించుకోవాలని సూచించారు లేకుంటే రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.  

ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవలసి ఉంటుంది. దేశంలో గనులపై కేంద్రప్రభుత్వానికే అధికారం, ఆజమాయిషీ ఉంటుంది. సింగరేణిలో కేంద్రప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. కనుకనే సింగరేణితో దేశవ్యాప్తంగా పలురాష్ట్రాలలో గల కొన్ని గనులను వేలం వేయాలని నిర్ణయించింది. కనుక కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అడ్డుకోలేదు. కానీ టిఆర్ఎస్‌ ద్వారా రాజకీయంగా అడ్డుకొనే ప్రయత్నాలు చేయగలదు. బహుశః అందుకే సింగరేణి గనుల జోలికి వస్తే రాష్ట్రం నుంచి బిజెపిని తరిమికొడతామని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించినట్లు భావించవచ్చు. 

సింగరేణి లాభాల బాటలో పయనిస్తూ దానిలో కార్మికులకు ఏటా 29 శాతం వరకు బోనస్‌గా ఇస్తున్న మాట వాస్తవం. అలాగే సింగరేణి లాభాలలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నియోజకవర్గాల అభివృద్ధి పేరిట కొంత సొమ్ము తీసుకొంటోంది. ఒకవేళ కేంద్రప్రభుత్వం సింగరేణిలో నాలుగు గనులను ప్రైవేట్ కంపెనీలకు అమ్మివేస్తే, ఆ మేరకు సింగరేణి కార్మికులు నష్టపోతారు. కేంద్రప్రభుత్వ నిర్ణయం వలన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నష్టపోతుంది. సింగరేణి గనుల వేలంపాటను వ్యతిరేకించడానికి ఇదీ ఒక కారణమయ్యి ఉండవచ్చు.  

అయితే ఈ విషయంలో కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గకపోవచ్చు కనుక మంత్రి కేటీఆర్‌ హెచ్చరించినట్లు ఇది రాష్ట్రంలో టిఆర్ఎస్‌-బిజెపిల మద్య మరో కొత్త యుద్ధానికి నాందికావచ్చు.


Related Post