ప్రధాని నరేంద్రమోడీ మొన్న ముచ్చింతల్‌లో శ్రీ రామానుజాచార్యులవారి విగ్రహాన్ని ఆవిష్కరించడంపై రాష్ట్ర పురపాలకమంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. “వివక్షకు చిహ్నామైన వ్యక్తి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు,” అని ట్వీట్ చేశారు.
దీనిపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందిస్తూ, “బర్నాల్ మూమెంట్,’ అని ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు జ్వరం సాకుతో సిఎం కేసీఆర్ మొహం చాటేశారని, ఇది ప్రధానిని అవమానించడమే అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ప్రధాని మోడీతో సిఎం కేసీఆర్ సఖ్యతగా ఉండటంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ‘గల్లీలో కుస్తీ...ఢిల్లీలో దోస్తీ...’ అని విమర్శలు గుప్పిస్తున్నప్పుడు, సిఎం కేసీఆర్ స్పందిస్తూ “రాష్ట్రంలో బిజెపి, టిఆర్ఎస్‌ల మద్య రాజకీయ శతృత్వం ఉన్నప్పటికీ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తాను ప్రధాని మోడీతో సత్సంబంధాలు కలిగి ఉండటం, అవసరమైనప్పుడు వెళ్ళి కలవడం తప్పు కాదని..” వాదించేవారు. కనుక ఇప్పుడు కూడా రాష్ట్రంలో బిజెపి, టిఆర్ఎస్‌ల మద్య రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు సిం విమానాశ్రయానికి వెళ్ళి గౌరవంగా ఆహ్వానించి ఉండి ఉంటే ఎంతో గౌరవంగా ఉండేది. గతంలో తను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నట్లు ఉండేది.
ప్రధాని మోడీ నగరానికి వచ్చినప్పుడు వెళ్ళి కలవకపోగా ఆయనను ఉద్దేశ్యించి ఈవిదంగా వ్యంగ్యంగా ట్వీట్ చేయడాన్ని ఎవరూ హర్షించరు. ఆధ్యాత్మిక విషయాలలో సీఎం కేసీఆర్‌కు మార్గదర్శనం చేసే చిన్న జీయర్ స్వామి, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి సాధిస్తోందని, రామానుజాచార్యులు చూపిన మార్గంలో పయనిస్తూ దేశంలో ప్రజలందరినీ చక్కగా చూసుకొంటున్నారంటూ ప్రశంసించినప్పుడు, టిఆర్ఎస్ నేతలు అందుకు విరుద్దంగా ప్రధాని మోడీని ఉద్దేశ్యించి మాట్లాడుతుండటం చిన్న జీయర్ స్వామి చెప్పింది కూడా అబద్దమే అన్నట్లుంది.
ప్రభుత్వాలను నడిపిస్తున్న పార్టీల మద్య రాజకీయ శతృత్వం ఉన్నప్పటికీ దేశాన్ని నడిపిస్తున్న వ్యక్తిని గౌరవించడం కనీస ధర్మం.