కేసీఆర్‌ రాజ్యాంగ సూచనకు ఢిల్లీలో బిజెపి ప్రచారం!

February 04, 2022


img

ఇటీవల సిఎం కేసీఆర్‌ కొత్త రాజ్యాంగం వ్రాసుకోవలసిన అవసరం ఉందని, ఈ సూచనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. దీనిని రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలతో సహా అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతికిస్తూ నిరసనలు తెలియజేస్తున్నాయి. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా సిఎం కేసీఆర్‌ సూచనను తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు హాజరవుతున్న ఆయన గురువారం ఢిల్లీలో తెలంగాణ భవన్‌ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద పార్టీ ఎంపీలతో కలిసి బిజెపి భీమ్ దీక్ష చేపట్టారు. తరువాత అక్కడి నుంచి పార్లమెంటు వరకు పాదయాత్ర చేసి నిరసన తెలిపారు. 

సిఎం కేసీఆర్‌ చేసిన ఈ సూచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బిజెపి ఎంపీలు, ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా కేసీఆర్‌ ప్రతిపాదనకు ఉచితంగా జాతీయ స్థాయిలో ప్రచారం చేసినట్లు అయ్యింది. ఇంతవరకు దీని గురించి తెలియని వారందరికీ కూడా తెలిసేలా చేశారు. కనుక బిజెపి ఎంపీలకు టిఆర్ఎస్‌ కృతజ్ఞతలు తెలుపుకోక తప్పదు. 

ప్రధాని నరేంద్రమోడీకి ఎప్పటి నుంచో రాజ్యాంగం మార్చాలనుకొంటున్నారని అందుకే సిఎం కేసీఆర్‌ ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారని, బిజెపి, టిఆర్ఎస్‌ రెండూ కలిసే ఈ కుట్ర చేస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌ ప్రతిపాదనను నిరసిస్తూ బిజెపి ఎంపీలు ఢిల్లీలో హడావుడి చేసి దానికి ఉచిత ప్రచారం కల్పించడం చూస్తే కాంగ్రెస్‌ ఆరోపణలు నిజమే అనిపించకమానదు. 



Related Post