కొత్త రాజ్యాంగం ఐడియా...బ్యాక్ ఫైర్ అయ్యిందా?

February 02, 2022


img

సిఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లో కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్‌లో లోపాలను ఎత్తిచూపారు. వాటిపై ఎవరూ పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు కానీ ఇప్పుడు అమలులో ఉన్న రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగం రాసుకోవాలనే సూచనపై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఎందుకంటే, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఈ రాజ్యాంగ రూపకర్త. ఆయన అందించిన ఈ రాజ్యాంగంతో బలహీనవర్గాలకు మేలు కలగడంలేదని సిఎం కేసీఆర్‌ చెప్పడమే విమర్శలకు తావిచ్చింది. బడుగు బలహీన వర్గాలకు మరింత మేలు చేకూర్చాలని సిఎం కేసీఆర్‌ భావించి ఈ సూచన చేసి ఉండవచ్చు కానీ రాజ్యాంగంతో బడుగు బలహీన వర్గాల సెంటిమెంట్ కూడా ముడిపడి ఉందనే విషయం ఆయన మరిచినట్లున్నారు. దీంతో దళితుల సంక్షేమం కోసం తన ఐపీఎస్ పదవిని వదులుకొని వచ్చిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌తో సహా ప్రతిపక్షాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పలువురు నేతలు సిఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.

'ఇది డా.అంబేడ్కర్‌ను అవమానించడమే...' అని బండి సంజయ్‌ అంటే, ‘రాజ్యాంగాన్ని కాదు...ముందు సిఎం కేసీఆర్‌నే మార్చాలి...’ అని బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ సాధించుకొన్నామనే సంగతి మరిచిపోయి, సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారంటూ...' బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితర కాంగ్రెస్‌ నేతలు కూడా సిఎం కేసీఆర్‌ చేసిన ఈ సూచనపై మండిపడ్డారు. 

రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఈ ప్రతిపాదననే ఓ అస్త్రంగా మలుచుకొని సిఎం కేసీఆర్‌పై ఎదురుదాడి చేస్తుండటం గమనిస్తే ఈ ప్రతిపాదన బెడిసికొట్టినట్లుగా అర్ధమవుతోంది. సిఎం కేసీఆర్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే దీనిపై ఇంత వ్యతిరేకత, ఇన్ని విమర్శలు వస్తుంటే, దేశంలో బడుగు బలహీనవర్గాలు ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలో ప్రజలు, అక్కడి పార్టీలు దీనిపై ఎంత తీవ్రంగా స్పందిస్తారో ఊహించుకోవచ్చు.


Related Post