కాళేశ్వరంకు జాతీయహోదా ఎందుకు ఇవ్వడం లేదు?

January 31, 2022


img

తెలంగాణ ఏర్పడిన తరువాత శరవేగంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. దాని ద్వారా రాష్ట్రంలో లక్షల ఎకరాలకు నీళ్ళు పారుతున్నాయి. కాళేశ్వరం వచ్చిన తరువాతే రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడి గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఇంజనీరింగ్ అద్భుతమని ప్రశంశలు అందుకొంటోంది. రాష్ట్ర, దేశ సంపద పెరిగేందుకు ఎంతగానో దోహదపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్‌ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తునానాయి. కానీ కేంద్రం దీనిపై కనీసం స్పందించడం లేదు! ఎందుకు? అని ప్రశ్నించుకొంటే బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. 

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, కమీషన్ల రూపంలో టిఆర్ఎస్‌ మంత్రులు వేలకోట్లు జేబులో వేసుకొన్నారని, ఆ అవినీతి సొమ్మునే ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర బిజెపి నేతలు నిత్యం ఆరోపిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని వారు ఆరోపిస్తున్నప్పుడు, కేంద్రప్రభుత్వం దానికి జాతీయహోదా ఇస్తే వారి వాదనలు తప్పని అంగీకరించినట్లవుతుంది. పైగా ఇప్పటివరకు రాష్ట్ర బిజెపి నేతలు ఈ ప్రాజెక్టుపై చేస్తున్న అవినీతి ఆరోపణలు, విమర్శలు అన్నీ అర్ధరహితంగా మారుతాయి. 

ఇక టిఆర్ఎస్ కోణంలో నుంచి చూస్తే ఒకవేళ కేంద్రం ఈ ప్రాజెక్టుకి జాతీయహోదా ఇస్తే అప్పుడు అది తమ విజయంగా ప్రచారం చేసుకొంటుంది కనుక ఆ క్రెడిట్ బిజెపికి దక్కదు. పైగా తాము కేంద్రం మెడలు వంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధించుకొన్నామని అలాగే మిగిలిన అన్ని డిమాండ్స్ కూడా సాధించుకొంటామని గట్టిగా వాదిస్తూ ప్రజలను సులువుగా ఆకర్షించగలదు. 

ఇక కాంగ్రెస్‌ కోణంలో నుంచి దీనిని చూస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా ఇస్తే టిఆర్ఎస్‌, బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందని, అందుకే అవినీతిలో కూడా అవి పరస్పరం సహకరించుకొంటున్నాయనే దాని వాదనలను కూడా దృవీకరించినట్లవుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిలో మోడీ ప్రభుత్వానికి కూడా భాగం ఉందని కాంగ్రెస్‌ వాదించవచ్చు. బహుశః అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వడం లేదని, ఎన్నటికీ లభించదని భావించవచ్చు.


Related Post