కేంద్రంతో పోరాటమే...తగ్గేదేలే: సిఎం కేసీఆర్‌

January 31, 2022


img

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో, సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో టిఆర్ఎస్‌ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేంద్రప్రభుత్వం రాష్ట్రం వివక్ష చూపుతూనే ఉందని, అయినా ఏడేళ్ళు చాలా ఓపికగా ఎదురుచూశామని సిఎం కేసీఆర్‌ అన్నారు. కానీ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరితో సహనం నశించిందని అన్నారు. కనుక రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటు సమావేశాలలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని టిఆర్ఎస్‌ ఎంపీలను కోరారు. టిఆర్ఎస్‌ ఎంపీలు 23 అంశాలపై కేంద్రంతో పోరాడబోతున్నారు. వాటిలో ప్రధానమైనవి: 

1. విభజన హామీల అమలు

2. నిధులు కేటాయింపు, బకాయిల విడుదల. 

3. అనుమతులు, జాతీయ హోదా

4. కేంద్రప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం  

విభజన హామీలలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్, గిరిజన యూనివర్సిటీ, ఐఐఎం, నవోదయ పాఠశాలల ఏర్పాటు తదితర అంశాలున్నాయి. 

నిధులు, బకాయిల కేటాయింపులో నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు మిషన్ భగీరధ, మిషన్ కాకతీయలకు రూ.24,000 కోట్లు, 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు ప్రకారం రాష్ట్రానికి రావలసిన రూ.817 కోట్లు, 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు ప్రకారం రాష్ట్రానికి రూ.723 కోట్లు స్పెషల్ గ్రాంట్‌, జీఎస్టీ పరిహారం కింద రూ.2,117 కోట్లు, ఐజిఎస్టీ సెటిల్‌మెంట్ క్రింద రూ.218 కోట్లు. ఇంకా రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రాయితీలు వగైరా. 

కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా, మేడారం జాతరకు జాతీయమేళా హోదా. రాష్ట్రంలో పెండింగులో ఉన్న వివిద ప్రాజెక్టులకు అనుమతుల మంజూరు వగైరా. 

ఉద్యోగాలు కల్పిస్తామనే ఎన్నికల హామీ అమలుచేయకపోగా కేంద్రప్రభుత్వ సంస్థలను అమ్మివేస్తూ వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులను రోడ్డున పడేస్తుండటం, రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలు, సంస్కరణలు అమలుచేయాలనుకోవడం, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే నిర్ణయాలు, విధానాలు తీసుకొంటుండటంపై కలిసివచ్చే పార్టీలతో పార్లమెంటులో కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సిఎం కేసీఆర్‌ టిఆర్ఎస్‌ ఎంపీలకు సూచించారు.


Related Post