నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ముందుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. అనంతరం మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ముందుగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తరువాత బడ్జెట్‌పై చర్చ కొనసాగుతుంది. ఫిబ్రవరి 6వరకు ఉభయసభలు బడ్జెట్‌పై చర్చించిన తరువాత 7వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ బడ్జెట్‌పై వివరణ ఇస్తారు. మళ్ళీ ఫిబ్రవరి 11వరకు బడ్జెట్‌పై చర్చలు జరుగుతాయి. మళ్ళీ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. వాటిలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు.
ఎప్పటిలాగే ఈసారి కూడా నిర్మలమ్మ భారీ బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు కానీ దేశ ఆర్ధిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్నందున, ఈసారి బడ్జెట్‌లో కూడా పెద్దగా వరాలు ఆశించలేము కానీ సామాన్యులకు వాతలు పెట్టకుండా ఉంటే చాలు. ఈ నెల నుంచి 5 రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున వాటికి భారీగా వరాలు ప్రకటించే అవకాశం ఉంది. దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈసారి రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, మౌలికవసతుల కల్పనకు నిర్మలమ్మ కేటాయింపులు, ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రులు లేఖలు వ్రాశారు. కానీ రాష్ట్రానికి నిర్మలమ్మ ఎంతిస్తారో…ఏమిస్తారో చూడాలి.