తెలంగాణలో మాదకద్రవ్యాలను గట్టిగా అడ్డుకోవాలని సిఎం కేసీఆర్ నిన్న పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులకు గట్టిగా చెప్పారు. భవిష్యత్ తరాల కోసం రాష్ట్రంలో మాదకద్రవ్యాల వాడకం, సరఫరాను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నిజమే...అయితే తెలంగాణ ప్రభుత్వం నిజంగానే అడ్డుకోగలదా?అంత పట్టుదల, చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉందా...లేక మళ్ళీ హడావుడేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే రెండేళ్ల క్రితం సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులపై కేసులు నమోదు చేసి, విచారణలు జరిపి, సాక్ష్యాధారాలు సేకరించి, ఫోరెన్‌సిక్ నివేదికలు కూడా సిద్దం చేసిన తరువాత ఆ కేసులన్నీ అటకెక్కించేసిన సంగతి తెలిసిందే. బహుశః వాటిలో అందరూ సినీ ప్రముఖులు ఉండటమే అందుకు కారణమయ్యుండవచ్చు. అంత పకడ్బందీగా నడిపించిన కేసులనే అటకెక్కించేసినప్పుడు కొత్త కేసులలో చర్యలు తీసుకొంటారని ఎలా భావించగలము? పైగా మాదకద్రవ్యాలు వినియోగించేవారిలో అధిక శాతం సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు లేదా వారి పిల్లలే ఉంటారు. ఒకవేళ ఏ ప్రముఖుడి పిల్లలో మాదకద్రవ్యాలు తీసుకొంటూ పట్టుబడితే పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారా? చేయగలరా? చేసినా కేసు ఎంతవరకు నడిపిస్తారు? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెపుతుంది.