పద్మశ్రీ వచ్చింది కానీ తినడానికి తిండి లేదు!

January 28, 2022


img

ఆయన ఓ కళాకారుడు. చేతిలో పాతవీణ వంటి ఓ వాద్య పరికరం పట్టుకొని వీధిలో తిరుగుతూ వాయిస్తుంటే ఎవరో బిచ్చగాడు అనుకొంటారు తప్ప ఆయన ఒక అతి ప్రాచీనమైన 12 మెట్ల కిన్నెరసాని వాద్యకళాకారుడని ఎవరూ గుర్తించలేకపోయారు. కనుకనే నేటికీ ఆయన అత్యంత దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఆయన కళా ప్రతిభను కేంద్రప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేయడంతో అందరూ ఇప్పుడు ఆయన ఎవరు...ఎక్కడ ఉంటారని గూగుల్‌లో వెతకడం ప్రారంభిచారు. 

కానీ ఆయన మూడేళ్ళ క్రితం తన భార్యకు వైద్యం చేయించడానికని హైదరాబాద్‌ వచ్చి చాలా రోజులపాటు నగరంలో ప్రజల మద్యనే తిరిగారు. సాయం కోసం ఆయన హైదరాబాద్‌లో ప్రభుత్వకార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే, ఆమె తినడానికి తిండిలేని పరిస్థితులలో రోడ్లపై అడ్డుకొనేది. అదే వారిద్దరికీ జీవనాధారమైంది. కేవలం రూ.1,000లు ఉంటే ఆమెకు వైద్యం చేయించగలిగేవాడినని కానీ తన వద్ద ఆ మాత్రం కూడా లేకపోవడంతో తన భార్య అనారోగ్యంతో చనిపోయిందని మొగులయ్య చెప్పారు. 

ఆమె చికిత్సకే తన వద్ద డబ్బు లేనప్పుడు ఆమె శవాన్ని ఊరికి ఎలా తీసుకువెళ్ళాలని తాను కుమిలిపోతున్నప్పుడు కేవీ రమణాచారి ఈ విషయం తెలుసుకొని రూ.10 వేలు ఇచ్చారని మొగులయ్య తెలిపారు. దాంతో తన భార్య శవాన్ని ఊరికి  తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేశానని మొగులయ్య చెప్పారు. 

అయితే ఆయన కష్టాలకు అంతే లేదు. కొన్ని రోజుల క్రితమే అతని కొడుకుకి గుండె సమస్య మొదలైంది. హైదరాబాద్‌ తీసుకువెళ్లి చికిత్స చేయించేందుకు తన వద్ద డబ్బు లేకపోవడంతో అతను కూడా చనిపోయాడని మొగులయ్య చెప్పారు. 

నా కళకు గుర్తింపుగా పద్మశ్రీ వచ్చింది సంతోషమే కానీ నేను నా ఎనిమిది మంది పిల్లలు తినడానికి తిండి లేదు. ఉండటానికి ఇల్లు లేదు. పైసా ఆదాయం లేదు. నా ఈ కళ నాతోనే అనతరించిపోకుండా కాపాడుకోవాలని ఉంది,” అని దర్శనం మొగులయ్య చెప్పారు.       

దర్శనం మొగులయ్య స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా, లింగాల మండలంలోని అవుసలికుంట గ్రామం. ఆయన ప్రతిభను గుర్తించిన ఏకైక వ్యక్తి పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌. మొగులయ్య గురించి తెలుసుకొని తన భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్‌లో కొంత భాగం ఆయన చేతే పాడించారు. ఆయన పరిస్థితి తెలుసుకొని యధాశక్తిన ఆర్ధికసాయం చేశారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించినందుకు పవన్‌ కళ్యాణ్‌ చాలా సంతోషం వ్యక్తం చేశారు. 

 




Related Post