నిన్న రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిఎం కేసీఆర్ హాజరుకాకపోవడాన్ని హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తప్పు పట్టారు. బుదవారం హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాకపోవడం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను అవమానించడమే. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. కేంద్రప్రభుత్వం ఫెడరల్ స్పూర్తి పాటించడంలేదని పదేపదే విమర్శించే సిఎం కేసీఆర్, మరి నిన్న ఆ స్పూర్తిని ఎందుకు పాటించలేదు?” అని ప్రశ్నించారు.
రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిఎం కేసీఆర్ వెళ్ళకపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఎవరూ వెళ్ళలేదు. ప్రతిపక్ష నాయకులు కూడా వెళ్ళలేదు. కరోనా కారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరుపుకొన్నప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీల తరపున ఒక్కో ప్రతినిధి, ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి హాజరయ్యి ఉండవచ్చు. కానీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు.
సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసి మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేడ్కర్ చిత్రపఠాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.