అందరికీ దారి చూపి...ఆత్మహత్య చేసుకొన్న జైపాల్ రెడ్డి

January 25, 2022


img

కామారెడ్డి జిల్లాకు చెందిన కాసాల జైపాల్ రెడ్డి (34) వ్యక్తిత్వ వికాస నిపుణుడు. గత 15 ఏళ్ళుగా అనేక వేలమందిలో స్పూర్తినింపి మళ్ళీ జీవితంలో నిలద్రొక్కుకోనేందుకు సాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తిత్వ వికాసంపై అనేక సదస్సులు నిర్వహించారు. వ్యక్తిత్వ వికాసంపై అనేక పరిశోధనలు చేశారు. అటువంటి వ్యక్తి అనారోగ్య సమస్యలను భరించలేక నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకొన్నారు!

జైపాల్ రెడ్డికి 2003లో పైల్స్ (మొలల) వ్యాధి రాగా చికిత్స చేయించుకొని దాని నుంచి విముక్తి పొందారు. ఆ తరువాత 2014లో హెర్నియాతో మూడేళ్ళు బాధపడి శస్త్ర చికిత్స చేయించుకొన్నారు. కానీ పూర్తిగా ఉపశమనం లభించలేదు. రాష్ట్రంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి వ్యక్తిత్వ వికాస సదస్సులు, పరిశోధనలు దాదాపు నిలిచిపోయాయి. గత పదిరోజులుగా గ్యాస్ట్రిక్ సమస్య దాంతోపాటే మళ్ళీ పైల్స్ సమస్య కూడా మొదలైంది. ఈ ఆరోగ్య సమస్యలు పట్టి పీడిస్తుండటంతో విరక్తి చెందిన జైపాల్ రెడ్డి సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులకు నిజాంసాగర్‌కు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళి తిరిగి రాలేదు. ఫేస్‌బుక్‌లో ‘నన్ను క్షమించండి,’ అని ఓ చిన్న మెసేజ్ పెట్టి నిజాంసాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకొన్నారు!

జైపాల్ రెడ్డి ఎదుర్కొంటున్న ఈ ఆరోగ్య సమస్యలన్నిటికీ చక్కటి వైద్య చికిత్సలు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయని అందరికీ తెలుసు. అలాగే ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ సమస్యలను...అంతకంటే తీవ్రమైన అనేక శారీరిక, మానసిక సమస్యలను, ఆర్ధిక, కుటుంబపరమైన, వృత్తిపరమైన సమస్యలను లోకంలో చాలామంది ఎదుర్కొంటున్నారని అందరికీ తెలుసు. కానీ చాలా మంది వాటితో పోరాడుతూనే జీవిస్తున్నారు. కానీ అందరికీ ధైర్యం చెప్పి దోవ చూపిన జైపాల్ రెడ్డి ఇటువంటి కారణంతో ఆత్మహత్య చేసుకోవడం చాలా విస్మయం కలిగిస్తుంది.


Related Post