కాంగ్రెస్‌ వల్ల కాదు...కాంగ్రెస్‌ లేకున్నా సాధ్యం కాదు

January 25, 2022


img

ప్రశాంత్ కిషోర్ పరిచయం అక్కరలేని పేరు. ఎన్నికలకు ‘మేనేజిమెంట్ వ్యవస్థ’ను పరిచయం చేసిన వ్యక్తి. 2014 ఎన్నికలలో బిజెపి తరపున పనిచేసి నరేంద్రమోడీ ప్రధాని పదవి అధిష్టించడానికి తోడ్పడిన ప్రశాంత్ కిషోర్,  ఆ తరువాత అదే బిజెపికి... నరేంద్రమోడీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీతో సహా ప్రాంతీయ పార్టీలకు పనిచేశాడు. ఆ క్రమంలో ఆయన కూడా బిజెపిని, నరేంద్రమోడీని తన రాజకీయ శతృవులుగా భావించడం మొదలుపెట్టారు. ఇప్పుడు బిజెపిని, నరేంద్రమోడీ గద్దె దింపడమే లక్ష్యంగా దేశంలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఇటీవల ఎన్‌డీటీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన కాంగ్రెస్‌, బిజెపి, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా... 

• నేను కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించాను. ఆ పార్టీకి బలమైన నాయకత్వం లేనందున బిజెపిని ఓడించాలంటే కాంగ్రెస్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాల్సి ఉంటుందని గట్టిగా చెప్పాను. దాదాపు రెండేళ్ళు ఆ పార్టీతో చర్చించినా ఫలితం లేకుండా పోయింది. 

• గత యూపీ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం నాకు ఓ చేదు అనుభవం. బహుశః కాంగ్రెస్‌ కూడా నా గురించి అలాగే భావిస్తుండవచ్చు. అందుకే ఆ పార్టీకి నాకూ పొసగలేదని భావిస్తున్నాను.  

• నాయకత్వ సమస్యతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బిజెపిని ఎన్నటికీ ఓడించలేదు. దానికి అంత శక్తి లేదు. కానీ నేటికీ దేశంలో బిజెపికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్ధి. కనుక కాంగ్రెస్‌ని కలుపుకోకుండా ఏ కూటమి కూడా బిజెపిని ఓడించలేదు. 

• లోక్‌సభ ఎన్నికలలో 100 సీట్లలో కాంగ్రెస్‌, బిజెపిల మద్యనే పోటీ ఉంటుంది. అయితే కాంగ్రెస్‌ నాయకత్వం బలహీన పడటం వలన వాటిలో 95 శాతం సీట్లను బిజెపి దక్కించుకోగలుగుతోంది. బిజెపి బలంగా మారడానికి ఇదీ ఒక కారణమే.   

• త్వరలో జరుగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి గెలిచినా, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి బలమైన కూటమిని ఏర్పాటు చేసుకోగలిగితే బిజెపిని ఓడించడం సాధ్యమే. అయితే ఇందుకోసం పార్టీలు, వాటి విధానాలలో కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంటుంది లేకుంటే సాధ్యం కాదు. 

• బిజెపికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటయ్యే కూటమికి నాయకత్వం వహించే వ్యక్తికి లేదా పార్టీకి మరో 5-10 ఏళ్ళకు తగిన వ్యూహరచన చేయగలగాలి. ఎన్నికలకు 5-6 నెలల ముందు పొత్తులు పెట్టుకొని బిజెపిని ఓడించాలనుకొంటే అది ఎన్నటికీ సాధ్యం కాదు. 

• బిజెపి ప్రధానంగా హిందుత్వ, అతి జాతీయవాదం, సంక్షేమ పధకాలతో ఎన్నికలలో పైచేయి సాధిస్తోంది. కనుక బిజెపిని ఓడించాలనుకొనే పార్టీ లేదా కూటమి ఈ మూడింటిలో కనీసం రెండింటిలో ప్రజల నమ్మకం పొందగలగాలి లేకుంటే ఎన్ని పార్టీలు కలిసినా ప్రయోజనం ఉండదు. 

• ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో గల 200 సీట్లలో బిజెపి కేవలం 50 సీట్లు మాత్రమే గెలుచుకోగలుగుతోంది. కనుక ఈ ఆరు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 100 సీట్లు గెలుచుకోగలిగితే అప్పుడు వాటి బలం 200-250కి చేరుతుంది. అప్పుడు ఉత్తరాది లేదా పశ్చిమ రాష్ట్రాలలో మరో 100 సీట్లు సాధించగలిగితే బిజెపిని గద్దె దించవచ్చు. ఈ వ్యూహంతోనే దేశంలో ప్రతిపక్షాలకు 2024 లోక్‌సభ ఎన్నికలలో సాయపడాలనుకొంటున్నాను. 

• దేశంలో బిజెపికి బలమైన ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాను ఈ ప్రయత్నాలు చేస్తున్నానని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు.


Related Post