ఎనుమాముల మార్కెట్‌ వద్ద మిర్చి రైతులు ఆందోళన

January 25, 2022


img

దేశంలో ఏ వస్తువుకైనా దాని ఉత్పత్తిదారుడే ధర నిర్ణయించుకొంటాడు...లాభాల కోసం అవసరమైనప్పుడల్లా అవసరమైనంతా పెంచుకొంటుంటాడు. కానీ వ్యవసాయోత్పత్తుల ధరలు మాత్రం కేంద్రప్రభుత్వం, వ్యాపారులు, దళారులు నిర్ణయిస్తుంటారు. చివరికి జుట్టు కత్తిరించేవారు, బట్టలు ఇస్త్రీ చేసేవారు కూడా తమ సేవలకు తామే ఛార్జీలు నిర్ణయించుకొంటారు. కానీ అప్పులు చేసి ఎండనక వాననక, రేయనక పగలనకా కష్టపడి పంటలు పండించిన రైతులకు తమ పంటకు ఎంత ధర వస్తుందో మార్కెట్‌కి వస్తే గానీ తెలియదు. కనీసం ప్రకటించిన ఆ మద్దతు ధర అయినా వస్తుందో రాదో తెలీదు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి ఇదే. 


వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం ఒక్కరోజే సుమారు 20,000 మిర్చి బస్తాలు వచ్చాయి. వ్యవసాయ మార్కెట్‌ అధికారులు తేజ రకం మిర్చికి జెండా పాట ధరను క్వింటాకి రూ.17,200గా నిర్ణయించినట్లు ప్రకటించడంతో మిర్చి రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఓ పదిమంది రైతులకు ఆ ధర ప్రకారం తీసుకొన్న తరువాత ధరను ఒకేసారి రూ.3,200 తగ్గించి రూ. 14,000కి దించేశారు. దాంతో మిర్చి రైతులు మార్కెట్‌ అధికారులపై మండిపడ్డారు. అయినా రైతుల ఆందోళనలు పట్టించుకోకుండా మార్కెట్‌ అధికారులు కాంటా పెట్టి అప్పటికే కొనుగోలు చేసిన మిర్చిని తూకం వేసి వ్యానులో లోడ్ చేయించడం మొదలుపెట్టారు. దీంతో మిర్చి రైతులు ఆగ్రహావేశాలతో కాంటాలను, వ్యానులో ఎక్కించిన మిర్చి బస్తాలను విసిరేసి వ్యాన్ అద్దాలను పగులగొట్టారు. కార్యాలయం ఎదుట ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. మార్కెట్‌ ఎదుట ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన చేశారు. 


చివరికి కలెక్టర్‌ ఆదేశం మేరకు ఆర్డీవో మహేంద్ర జీని వచ్చి ఆందోళన చేస్తున్న మిర్చి రైతులతో చర్చలు జరిపారు. క్వింటాకు అదనంగా మరో రూ.1,000 చొప్పున అంటే రూ.15,000 ఇప్పిస్తానని, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళ, బుదవారాలు మార్కెట్‌కు శలవు ఉన్నప్పటికీ రెండు రోజులూ మిర్చి కొనుగోళ్ళు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అయితే మళ్ళీ కాంటా పెట్టిన తరువాత క్వింటాకు అదనంగా రూ.200 మాత్రమే ఇస్తుండటంతో మిర్చి రైతులు అమ్మకాలు నిలిపేసి మళ్ళీ ధర్నాకు దిగారు. దీంతో ఆర్డీవో మహేంద్ర జీని మళ్ళీ వచ్చి మంగళవారం తప్పకుండా కొత్త ధర ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో మిర్చి రైతులు సాయంత్రం 5 గంటలకు ఆందోళన విరమించారు. మరి ఈరోజైనా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో చూడాలి.


Related Post