కేంద్రంపై లేఖాస్త్రాలు సందిస్తున్న సిఎం కేసీఆర్‌, మంత్రులు

January 24, 2022


img

ధాన్యం కొనుగోలు సమస్యపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా చల్లబడినప్పటికీ, వేరే అంశాలపై టిఆర్ఎస్‌ కేంద్రంతో యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. సిఎం కేసీఆర్‌, మంత్రులు వరుసగా కేంద్రంపై లేఖాస్త్రాలు సందిస్తూనే ఉన్నారు. 

ఐఏఎస్ అధికారుల డెప్యూటేషన్‌కు సంబందించి 1954 నాటి నియమ నిబందనల సవరించాలని ఇటీవల కేంద్రం ప్రతిపాదించింది. దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ లేఖ వ్రాశారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణల ద్వారా రాష్ట్రాలలో ఐఏఎస్ అధికారులను కేంద్రం గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నామని, ఇది ఫెడరల్ స్పూర్తికి విరుద్దమని సిఎం కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. కనుక ఆ ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఆర్ధిక మంత్రి హరీష్‌రావు కూడా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ వ్రాశారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రానికి రావలసిన బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రానికి రావలసిన రూ.495.20 కోట్లు పొరపాటున ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేసిందని, దాని గురించి ఎన్నిసార్లు అడిగినా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సు ప్రకారం రాష్ట్రానికి వివిద పద్దుల క్రింద రూ.817.61 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని లేఖలో గుర్తు చేశారు.  నీతి ఆయోగ్ సూచించినట్లుగా తెలంగాణ రాష్ట్రానికి రూ.24,205 కోట్లు విడుదల చేయాలని మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. 

ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలో చేనేత క్లస్టర్లు, పవర్ లూమ్ క్లస్టర్లు, వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈసారి బడ్జెట్‌లో వీటన్నిటికీ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడంలేదని, దీంతో తమ సహనం నశిస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు అన్ని రాష్ట్రాలు కేంద్రానికి ఈవిదంగా నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల కొరకు లేఖలు వ్రాయడం సహజమే. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్న ఈ లేఖలపై కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 


Related Post