పాకిస్థాన్‌కు ఉగ్రవాదమే ఆయుధం...శాపం!

January 22, 2022


img

భారత్‌, పాకిస్థాన్‌లకు కేవలం కొన్ని గంటల వ్యవధిలో స్వాతంత్ర్యం వచ్చింది. ఈ ఏడున్నర దశాబ్ధాలలో భారత్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది అగ్రదేశాలతో పోటీపడే స్థాయికి ఎదగగా, పాక్‌ ఉగ్రవాదులకు కేంద్రంగా మారి దయనీయ స్థితిలో ఉంది. భారత్‌ను అస్థిరపరచాలనే ప్రయత్నంలో పాముకి పాలు పోసి పెంచినట్లు ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. దానినే ఆయుధంగా చేసుకొని భారత్‌ను దెబ్బ తీయాలని 3-4 దశాబ్ధాలుగా ప్రయత్నిస్తోంది. 

అయితే అదే పాకిస్థాన్‌కు... ముఖ్యంగా పాక్‌ ప్రజల పాలిట శాపంగా మారింది. ఆ ఉగ్ర సర్పం అప్పుడప్పుడు పాకిస్థాన్‌ను కూడా కాటేస్తూనే ఉంది. వేలాదిమంది ప్రాణాలు బలిగొంటూనే ఉంది. అంతేకాదు... దానికి పాకిస్థాన్‌ వివిద రూపాలలో మూల్యం చెల్లించుకొంటూనే ఉంది.

పాకిస్థాన్‌లో ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతాయో తెలీని పరిస్థితులు నెలకొని ఉండటంతో ఇదివరకు ఓసారి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు చివరి నిమిషంలో పాక్‌ పర్యటనను రద్దు చేసుకొన్నాయి. సుమారు 27 ఏళ్ళ తరువాత మళ్ళీ ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 ఆడేందుకు సిద్దమవుతుండగా లాహోర్‌లోని అనార్కలీ మార్కెట్ లో మళ్ళీ నిన్న బాంబులు పేలాయి. ఈ పేలుళ్ళలో ముగ్గురు మృతి చెందగా మరో 30 మంది గాయపడ్డారు. బాంబు పేలుళ్ళతో ప్రాణనష్టం ఎలాగూ తప్పదు దాంతో పాటు ఆ ప్రభావం ఆస్ట్రేలియా జట్టు పర్యటనపై కూడా పడే అవకాశం ఉంది. ఈ నెల 27 నుంచి పాకిస్థాన్‌ సూపర్ లీగ్-2022 మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. 

వాటిని అడ్డుకోవడం కోసమే కొన్ని అసాంఘికశక్తులు ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్నాయని పాక్‌ కేంద్రమంత్రి షేక్ రశీద్ అహ్మద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో పేలుళ్ళు జరిగితే తమ దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని వాపోతున్న పాక్‌ మంత్రి, మరి దాదాపు 3-4 దశాబ్ధాలుగా భారత్‌ను అస్థిరపరిచేందుకు తమ దేశం ఎందుకు ప్రయత్నిస్తోంది?పాక్‌ ఉగ్రవాదులు భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భారత్‌ వాటినన్నిటినీ సమర్ధంగా ఎదుర్కొని ముందుకే సాగుతోంది కదా?మరి పాక్‌ పాలకుల నీడలో పెరుగుతున్న ఉగ్రవాదులను...వారి దాడులను ఎందుకు అడ్డుకోలేకపోతోంది?అని సందేహం కలుగక మానదు. అసలు భారత్‌ను అస్థిరపరిచేందుకు ఉగ్రవాదులపై పాక్‌ చేస్తున్న ఖర్చును తమ దేశాభివృద్ధికి వినియోగించి ఉంటే, నేడు పాక్‌ కూడా భారత్‌తో పోటీ పడే స్థాయికి ఎదిగి ఉండేది.  

ఉగ్రవాదం పాక్‌ స్వయంకృతాపరాధమే కనుక దీనికి అది ఎవరినీ నిందించలేదు. ఒకవేళ నిందించదలిస్తే తనను తానే నిందించుకోవలసి ఉంటుంది.


Related Post