యూపీలో ఓడిపోతే... బిజెపి పరిస్థితి ఏమిటి?

January 14, 2022


img

వచ్చే నెల 10వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు ఏడు దశలలో యూపీ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. దేశంలోకెల్లా అత్యధికంగా 403 శాసనసభ, 80 లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ  సార్వత్రిక ఎన్నికలలో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

కనుక యూపీ శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారం నిలబెట్టుకోవడం బిజెపికి చాలా అవసరం. అయితే యూపీ ప్రజలలో యోగీ సర్కారు పట్ల తీవ్ర అసంతృప్తి, వ్యతిరేక పెరిగినందున ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీవైపు మొగ్గు చూపవచ్చని పలు సర్వేలు జోస్యం చెపుతున్నాయి. 

బహుశః అందుకే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లు యోగీ సర్కారు నుంచి ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసారు. త్వరలో మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారందరూ అఖిలేష్ యాదవ్ పంచన చేరేందుకే రాజీనామాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపికి చాలా కీలకమైన ఈ ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామాలు చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరుతుండటం గమనిస్తే యూపీలో బిజెపి ఓటమి ఖాయమని సూచిస్తున్నాయి. 

ఒకవేళ యూపీలో బిజెపి ఓడిపోయి, సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే 2024లో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీయే ఎక్కువ సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంటుంది. అప్పుడు కేంద్రంలో అధికారం నిలుపుకోవాలంటే బిజెపి మిగిలిన రాష్ట్రాల ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవలసి ఉంటుంది. 

అయితే దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన మూడు రాష్ట్రాలలో నేటికీ బిజెపి పూర్తి పట్టు సాధించలేకపోతోంది. కనుక వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తనకు పట్టున్న గుజరాత్‌, రాజస్థాన్, బిహార్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో, అలాగే ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు సంపాదించుకోవలసి ఉంటుంది లేకుంటే కేంద్రంలో అధికారం చేజారిపోతుంది. 

కనుక ఈ యూపీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో గెలిచి తీరాలని బిజెపి గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈసారి యూపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడేవరకు ఎదురుచూడాల్సిందే.


Related Post