అక్కడ ఆకలి కేకలు..ఇక్కడ పేరుకుపోతున్న బియ్యం రాసులు

January 14, 2022


img

భారత్‌లో గత కొన్నేళ్ళుగా సాగునీరు, విద్యుత్ సదుపాయాల పరిస్థితి మెరుగవడంతో వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగింది. కేంద్రం వద్ద మరో 5 ఏళ్ళకు సరిపడా బియ్యం నిలువలు ఉండటం, ఆ కారణంగా తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోవడం గమనిస్తే భారత్‌ ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఎంత సంవృద్ధి సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క తెలంగాణలోనే కాదు...దేశంలో పలు రాష్ట్రాలలో ఇప్పుడు బియ్యం, గోదుమలు నిలువలు పేరుకుపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా చాలా దయనీయంగా ఉన్నాయి. తాలిబన్ల పాలనలో     ఆఫ్ఘనిస్తాన్‌లో ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తినడానికి తిండి లేక పసిపిల్లలను అమ్ముకోనేవారు కొందరైతే, తమ కిడ్నీలను అమ్ముకొని కుటుంబాలను పోషించుకొంటున్నవారు కోకొల్లలు. గత మూడు నాలుగు నెలల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో వేల సంఖ్యలో కిడ్నీ ఆపరేషన్లు జరిగాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో సుమారు 2.28 కోట్ల మంది ఆహారం దొరక్క నానా కష్టాలు పడుతున్నారు. 

ప్రపంచదేశాలు తక్షణం సహాయం చేయకపోతే రాబోయే రోజుల్లో వారిలో సుమారు 87 లక్షల మంది ఆకలితో చనిపోతారని డబ్ల్యూ.ఎఫ్.పి. ప్రతినిధి మేరీ ఎలెన్ మెక్‌గ్రోర్టీ తెలిపారు. వారికి కేవలం ఆహారం మాత్రమే అందించాలంటే 2.6 బిలియన్ డాలర్లు అవసరం ఉంటుందని తెలిపారు. ఇక మందులు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలంటే 4.4 బిలియన్ డాలర్లు అవసరం ఉంటుందని ఆమె తెలిపారు. కనుక భారత్‌తో సహా ప్రపంచదేశాలన్నీ ఆఫ్ఘనిస్తాన్‌కు సాయపడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 

భారత్‌ ఇప్పటికే కోట్లాది రూపాయలు విలువగల మందులు, బియ్యం వగైరా ఆఫ్ఘనిస్తాన్‌కు పంపించింది. అయితే లక్షల కోట్లు ఖర్చు చేసి నిరంతరంగా ఆఫ్ఘనిస్తాన్‌కు నిరంతరంగా, ఉచితంగా ఆహారధాన్యాలు అందించడం ఏ దేశానికైనా సాధ్యం కాదు కనుక ప్రపంచదేశాల సాయంతో భారత్‌లో మిగులు బియ్యం, గోధుమలను పంపించగలిగితే ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజల ఆకలి తీర్చి వారి ప్రాణాలు కాపాడినట్లవుతుంది. భారత్‌కు మిగులు బియ్యం, గోధుమల సమస్య కూడా తీరుతుంది. 


Related Post