ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమాద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ త్వరలో జరుగబోయే పంజాబ్ శాసనసభ ఎన్నికలలో తమ పార్టీని గెలిపించుకొని ఆ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా వినూత్నమైన ప్రతిపాదనను ప్రజల ముందు ఉంచారు. ఈప్పటికే పార్టీ అభ్యర్ధులను ప్రకటించినందున వారిలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవరు కావాలో మీరే నిర్ణయించుకొని 70748 70748 నంబరుకు ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. పంజాబ్‌లో మూడు కోట్ల మంది ప్ర్జల అభిప్రాయం మేరకు తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఖరారు చేస్తుందని చెప్పారు. రేపటి నుంచి ఈనెల 17 సాయంత్రం 5 గంటలలోపుగా ప్రజలు తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎన్నుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
ఇది చాలా విన్నూత్నమైన ఆలోచనే కానీ ఈవిదంగా ప్రజలందరూ ఆమాద్మీ పార్టీకే ఓట్లు వేసేలా చేయాలనే ఆశ, ఆలోచన కూడా కనబడుతోంది. అధికారం కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్, బిజెపి, అకాలీదళ్ పార్టీలు దీనిని సులువుగానే పసిగట్టగలవు. అంతేకాదు… ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇటువంటి ప్రయోగం చేయగలరా? అని సవాలు విసిరినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఆమాద్మీ పార్టీ అమలుచేస్తున్న ఈ ఎన్నికల ఎత్తుగడకు మరి పంజాబ్ ప్రజలు పడతారా లేదా? మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడినపుడు తెలుస్తుంది.