గత సార్వత్రిక ఎన్నికలకు ముందే సిఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేసి జాతీయరాజకీయాలలో ప్రవేశించాలనుకొన్నారు. కానీ ఆయన అంచనాలన్నీ తలక్రిందులు అవడంతో ఆ ఆలోచన విరమించుకొన్నారు. కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను గద్దె దించాలని బిజెపి ప్రయత్నిస్తుండటంతో, ఆయన కూడా కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు మళ్ళీ కసరత్తు ప్రారంభించారు. దానిలో భాగంగా ఇటీవల చెన్నై వెళ్లినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయ్యారు. నాలుగు రోజుల క్రితం జాతీయస్థాయి వామపక్ష నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. తాజాగా బిహార్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో నిన్న ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో వారిరువురూ మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, జాతీయ రాజకీయాలు, త్వరలో జరుగబోయే 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో బిజెపి విజయావకాశాలు, ఈ ఏడేళ్ళలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారు. దేశంలో బిజెపికి అడ్డుకట్ట వేసి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బలమైన కూటమి ఏర్పాటు అవసరమని ఇరువురూ ఏకాభిప్రాయానికి వచ్చారు. భావస్వారూప్యత కలిగిన పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు సిఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్జేడీ పూర్తి మద్దతు ఇస్తుందని తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ప్రగతి భవన్ నుంచే ఫోన్ చేసి సిఎం కేసీఆర్‌తో మాట్లాడించారు. ఆయన కూడా సిఎం కేసీఆర్‌ను అభినందించారు.