తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నందున జనవరి 20వరకు సభలు, సమావేశాలు నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపక్ష నేతలు వాటిని ధిక్కరిస్తున్నారంటూ వారిని అరెస్ట్ చేస్తోంది కూడా. మరో పక్క టిఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ నేతలు సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఏమంటే కరోనా ఆంక్షలు పాటిస్తున్నామని సమర్ధించుకొంటున్నారు. ప్రతిపక్షాలకు వర్తించే ఆంక్షలు టిఆర్ఎస్‌కు వర్తించవా?తమ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలే పాటించరా? రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ ఉత్తర్వులను, కరోనా ఆంక్షలను పట్టించుకోకుండా సభలు, నిరసన, మౌన దీక్షలు చేస్తుండటం విస్మయం కలిగిస్తుంది.
కేంద్రప్రభుత్వం కూడా రాష్ట్రాలకు కరోనా మార్గదర్శకాలు జారీ చేసి వాటిని తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించింది. కానీ బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపగానే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చి నిరసన ర్యాలీకి సిద్దమయ్యారు. చివరి నిమిషంలో దానిని రద్దు చేసుకొన్నా ఆ సమయంలో వేలాదిమంది గుమిగూడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా ఆంక్షలను పట్టించుకోకుండా ఆయన ఈవిదంగా వ్యవహరించడాన్ని ఏమనుకోవాలి?
బండి సంజయ్ బెయిల్‌పై జైలు నుంచి విడుదలై బయటకు వచ్చినప్పటి నుంచి ప్రతీరోజూ బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటిస్తూ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, ఆంక్షలు తమకు వర్తించవని వారు భావిస్తున్నట్లు అనుకోవాలేమో?
ఇక యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో ఆయా రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్షాలు ప్రతీరోజూ వేలాదిమందితో ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి.
కానీ ప్రజలు మాస్కులు ధరించకుండా బయట కనబడితే రూ.1,000 జరిమానా, కర్ఫ్యూ సమయంలో బయట తిరిగితే చట్ట ప్రకారం చర్యలు చేపడతామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.
అంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కరోనా మార్గదర్శకాలు, ఆంక్షలు, ఉత్తర్వులు కేవలం ప్రజలకే వర్తిస్తాయా?ప్రభుత్వాలను నడుపుతున్న పార్టీలకు, ప్రతిపక్షాలకు వర్తించవా? ఈ నియమ నిబందనలకు, ఉత్తర్వులకు...అన్నిటికీ రాజకీయ నేతలు అతీతమైనవారా?
ప్రజలకు ఆదర్శంగా నిలావాల్సిన అధికార, ప్రతిపక్ష రాజకీయ నేతలే ఈవిదంగా వ్యవహరిస్తుంటే దేశంలో కరోనా కేసులు పెరగకుండా ఉంటాయా? దేశంలో కరోనా పెరుగుదలకు ప్రజల కంటే రాజకీయ పార్టీలే ఎక్కువ కారణమని చెప్పక తప్పదు.