భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం సజీవదహనం చేసుకొని ఆత్మహత్యలకు పాల్పడింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పప్పుల సురేష్ కుటుంబం విజయవాడలో ఆత్మహత్యలు చేసుకొంది. వేరే జిల్లాలకు బదిలీ అయినందుకు సరస్వతి అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకోగా, శ్రీమతి (మాధవి) అనే మరో ఉపాద్యాయురాలు తీవ్ర ఆందోళన కారణంగా గుండెపోటుతో మరణించారు. ములుగు జిల్లాలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అశోక్ కుమార్ నిన్న ఖమ్మం పట్టణంలో ఆత్మహత్య చేసుకొన్నాడు. అంతకు ముందు ఇంటర్ పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చాయని లేదా ఫెయిల్ అయ్యామనే బాధతో కొందరు విద్యార్ధినులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. కరోనా సోకుతుందేమోననే భయంతో ఆత్మహత్యలు చేసుకోనవారు కూడా ఉన్నారు!
ఎవరి సమస్యలు, కష్టాలు వారికే తెలుసు కనుక అవి వారికి చాలా తీవ్రంగా అనిపించడం సహజమే. కనుక ఈ ఆత్మహత్యలను తొందరపాటుగా భావించడం కూడా తప్పే. కానీ ఈ ప్రపంచంలో ప్రతీ మనిషికీ...ఆ మాటకు వస్తే ప్రతీ జీవికీ, చివరికి చెట్టుకు చేనుకు కూడా కష్టాలు లేదా సమస్యలు ఉంటాయి. కష్టాలు, సమస్యలు లేని జీవి ఈ ప్రపంచంలోనే లేదు. కనుక జీవితంలో కష్టాలు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయనే గ్రహింపు... వాటిని ఎదుర్కోవాలనే ఆలోచన చాలా అవసరం.
భావి భారత పౌరులను తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయురాలు, సమాజానికి రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు చిన్న సమస్యను ఎదుర్కొలేక ఆత్మహత్యలు చేసుకొనేంత బలహీనంగా ఉండటం ఎవరూ సమర్ధించలేరు. వేరే జిల్లాకు బదిలీ అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి తప్ప ఏమవుతుంది? చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు, అసలు ఉద్యోగమే లేక తల్లితండ్రులపై ఆధారపడినవారు ఇంతకంటే ఎక్కువ మనోవేదన, కష్టాలే అనుభవిస్తున్నారు కదా?
ఇంటర్‌లో తక్కువ మార్కులు వస్తే బెటర్‌మెంట్, ఫెయిల్ అయితే సప్లిమెంటరీ వ్రాసుకోవచ్చు కదా?అసలు మార్కులు తక్కువ రావడానికి, ఫెయిల్ అవడానికి కారణం ఏమిటి?అని ఆలోచిస్తే సమస్య తమలోనే ఉందని విద్యార్దులకు అర్ధం అవుతుంది. విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకోవడం అంటే తమ తల్లితండ్రుల పట్ల, విద్యలు నేర్పుతున్న గురువుల పట్ల గౌరవం, కృతజ్ఞత, నమ్మకం తమపై తమకు ఆత్మవిశ్వాసంలేనట్లే భావించాల్సి ఉంటుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పినట్లు విద్యార్దులు తమ లోపాలను గుర్తించుకొని మరింత కష్టపడి చదివి ఉత్తీర్ణులవ్వాలి.
అప్పులు, ఆర్ధిక సమస్యలు, వేధింపులతో ఆత్మహత్యలు చేసుకొనేవారు అనుభవించే కష్టాలు, మనోవేదనని ఎవరూ అంచనా వేయలేరు. అలాగని వారి ఆత్మహత్యలను ఎవరూ సమర్ధించలేరు కూడా. కొన్నిసార్లు ఊహించని సమస్యలతో ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టవచ్చు లేదా పెద్ద పెద్ద ఆలోచనలతో మొదలుపెట్టే వ్యాపారాలు దెబ్బ తినవచ్చు. చాలామంది ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం, ఆదాయానికి మించిన కోరికల కారణంగా ఆర్ధిక సమస్యలలో చిక్కుకొంటుంటారు. కనుక అడుగు ముందుకు వేసేటప్పుడే పర్యవసనాలను నిష్పక్షపాతంగా బేరీజు వేసుకొని చూడడటం చాలా ముఖ్యం.
ఎవరు ఏ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నప్పటికీ వారు క్షణికావేశాన్ని, మనోవేదనను పక్కను పెట్టి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోగలిగితే అప్పుడు వారికే ఏదో ఓ పరిష్కార మార్గం తప్పక కనిపిస్తుంది. ఆ సమస్యను అధిగమించిన తరువాత జీవితంలో ఓ విజయం సాధించామనే సంతోషం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఏదో కారణంతో ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నవారు కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఆనాడు తాము ఎంత బలహీనంగా ఉన్నామో...ఇప్పుడు ఎంతగా ఎదిగామో అని ఓసారి అనుకోకుండా ఉండరు. అంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనని వాయిదా వేసుకోవడంతోనే జీవితంలో ఓ విజయం సాధించినట్లవుతుంది కదా?