హైదరాబాద్‌లో పార్టీ సభలు, సమాశాలలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఐ, సిపిఎం నేతలతో సిఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఇప్పటి నుంచే ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్ వామపక్ష అగ్రనేతలతో సమావేశమైతే, ఎన్నికలకు ముందు ఫ్రంట్ అవసరమేలేదని సీతారాం ఏచూరి చెప్పడం విశేషం. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక పొత్తుల గురించి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొంటామని సీతారాం ఏచూరి చెప్పడం సరైనదే.
అయితే తెలంగాణలో టిఆర్ఎస్ ఏ పార్టీలతోనైనా ఎన్నికల పొత్తులు పెట్టుకోగలదా?పెట్టుకొని వాటికి సీట్లు కేటాయించగలదా?అని ముందుగా ఆలోచించక తప్పదు.
తెలంగాణలో మొత్తం 119 శాసనసభ స్థానాలలో మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ పార్టీకి 7 సీట్లుపోగా టిఆర్ఎస్‌కు 112 సీట్లు మాత్రమే మిగులుతాయి. వాటి కోసం టిఆర్ఎస్‌లో అంతకు రెట్టింపు మంది పోటీ పడుతుంటారు. కనుక టిఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో బిజెపిని అడ్డుకొనేందుకు ఒకవేళ టిఆర్ఎస్ వామపక్షాలతో పొత్తులు పెట్టుకోదలిస్తే వాటికి కనీసం 15-20 సీట్లు విడిచిపెట్టాల్సి ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. పైగా వాటికి అన్ని సీట్లు కేటాయించినా అవి గెలవలేవు. కనుక ఆ సీట్లను కాంగ్రెస్, బిజెపిలకు చేజేతులా అప్పజెప్పినట్లవుతుంది. అంటే టిఆర్ఎస్, వామపక్షాలు పొత్తులు పెట్టుకొన్నట్లయితే వాటితో కాంగ్రెస్, బిజెపిలకే ఎంతో కొంత లబ్ది కలుగుతుంది. టిఆర్ఎస్‌కు ఆ మేరకు శాసనసభలో బలం తగ్గుతుంది. టిఆర్ఎస్ ఇది కోరుకోదు కనుక రాష్ట్రంలో టిఆర్ఎస్, వామపక్షాల పొత్తులు దాదాపు అసాధ్యమేనని చెప్పవచ్చు.