తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలోని పోలీస్ కార్యాలయాలతో అనుసంధానిస్తూ హైదరాబాద్, బంజారాహిల్స్‌లో రోడ్ నంబర్ 12లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణపనులు మార్చి 15లోగా పూర్తికావచ్చునని తెలుస్తోంది.
రూ.700 కోట్లు వ్యయంతో ఏడు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు భారీ టవర్స్ నిర్మిస్తున్నారు. వాటిలో రెండు 16 అంతస్తులతో మరొ రెండు 20 అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఈ టవర్స్‌లో 3వ అంతస్తు నుంచి 6వ అంతస్తు వరకు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, మున్సిపల్ ప్రాంతాలలో అమర్చిన 6,65,076 సీసీ కెమెరాలు దీనిలో ఏర్పాటు చేయబోయే భారీ స్క్రీన్స్‌తో అనుసంధానమై ఉంటాయి. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరుగుతోందో ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రత్యక్షంగా చూడవచ్చన్న మాట! అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్నారు.
ఈ టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభించి ఆరేళ్ళవుతోంది. కానీ మద్యలో కరోనా కారణంగా రెండేళ్ళు పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు చురుకుగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరుకి చాలావరకు పనులు పూర్తయిపోతాయి. మార్చి 15లోగా మిగిలిన పనులు పూర్తి చేసి నెలాఖరులోగా ప్రారంభోత్సవం చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు.