భారత్‌లో కరోనా సునామీ మళ్ళీ మొదలైంది. తెలంగాణలో హటాత్తుగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో టీఎస్‌ఆర్టీసీ, మెట్రోలకు మళ్ళీ కరోనా కష్టాలు మొదలవబోతున్నాయి.
టీఎస్‌ఆర్టీసీ ఎప్పటి నుంచో నష్టాలలోనే మునిగి తేలుతోంది. కరోనా వచ్చాక ఇంకా నష్టాలలో కూరుకుపోయింది. వీసి సజ్జనార్ టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తరువాత దానిని గాడిన పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఇప్పుడే రాష్ట్రంలో మళ్ళీ కరోనా కేసులు పెరగడంతో బస్సులను మళ్ళీ డిపోలలో పెట్టుకోవలసిరావచ్చు లేదా 50 శాతం బస్సులను 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించవలసిరావచ్చు. ఇదే కనుక జరిగితే వీసి సజ్జనార్ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. ఈ సమస్యను ఆయన ఏవిదంగా ఎదుర్కొంటారో చూడాలి.
వేల కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేసిన హైదరాబాద్ మెట్రో కరోనాకు ముందు మంచి లాభాలలో పరుగులు పెడుతుండేది. కానీ మెట్రో పరుగులకు కరోనా బ్రేకులు వేయడంతో అది కూడా నష్టాలబాట పట్టింది. అయినప్పటికీ ఏదో రకంగా మనుగడ సాగించాలని ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రతీ నాలుగైదు నెలలకు ఓసారి కరోనా విరుచుకు పడుతుండటంతో మెట్రో కూడా క్రమంగా నష్టాలలో మునుగుతోంది. మెట్రో నష్టాలకు మరో రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. దానిపై భారీ పెట్టుబడి పెట్టడం, మెట్రో నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటం దానికి గుదిబండగా మారాయని చెప్పవచ్చు. అయితే మెట్రో రైళ్ళు ఎటువంటి ఆటంకం లేకుండా నడుస్తున్నట్లయితే మెట్రో నిర్వహణ పెద్ద కష్టం కాదు. కానీ కంటికి కనబడని కరోనా మెట్రో రైళ్ళకు బ్రేకులు వేస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి.